సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు శిష్యుడు వి. ఎన్. ఆదిత్య. అందుకే ఈయనలోనూ ఆయన పోకడలు కనిపిస్తాయి. గురువుగారి బాటలోనే సాగుతున్న ఆదిత్య రాశికి కాకుండా వాసికి ప్రాధాన్యమివ్వాలని తపిస్తుంటారు. ఏప్రిల్ 30 వి.ఎన్. ఆదిత్య పుట్టిన రోజు. విశేషం ఏమంటే ఈ యేడాది అక్టోబర్ 19తో దర్శకుడిగా వి.ఎన్. ఆదిత్య రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసంతా నువ్వే’ 2001 అక్టోబర్ 19న విడుదలై అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత ‘శ్రీరామ్, నేనున్నాను’ వంటి విజయవంతమైన చిత్రాలను వి.ఎన్. ఆదిత్య తెరకెక్కించారు. ఈ ఇరవై సంవత్సరాల్లో ఆయన దర్శకత్వం వహించింది తొమ్మిది చిత్రాలే! కానీ చిత్రంగా… ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలను రూపొందిస్తున్నారు వి. ఎన్. ఆదిత్య.
విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ జంటగా వి. ఎన్. ఆదిత్య రూపొందించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘వాళ్ళిద్దరి మధ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. మధు స్రవంతి స్వరాలు అందించిన ఈ సినిమాను అర్జున్ దాస్యన్ నిర్మించారు. అలానే స్టార్ కమెడియన్, హీరో సునీల్, అందాల భామ సలోని జంటగా వి.ఎన్. ఆదిత్య రూపొందిస్తున్న మరో చిత్రం ‘మర్యాద క్రిష్ణయ్య’. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సునీల్, సలోని జంటగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘మర్యాద క్రిష్ణయ్య’ చిత్రం పైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను టి. జి. విశ్వప్రసాద్, కిశోర్ గరికపాటి, అర్చనా అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి లక్ష్మీ భూపాల్ మాటలు రాయగా, సాయికార్తీక్ స్వరాలు అందిస్తున్నాడు. అలానే… సీనియర్ నటీనటులు జయప్రద, రాజేంద్ర ప్రసాద్ జంటగా వి. ఎన్. ఆదిత్య ‘లవ్ ఎట్ 65’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాస్తంత విరామం తర్వాత జయప్రద మళ్ళీ ఈ సినిమాతోనే తెలుగు తెరపైకి వస్తోంది. ఇది షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి. జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల దీనికి సహ నిర్మాత. ‘ముగ్గురు’ సినిమా తర్వాత వి.ఎన్. ఆదిత్య సినీ ప్రయాణం కాస్తంత మందగించినా, ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచి, బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలు చేస్తుండటం విశేషం. అలానే ఇటీవలే వి.ఎన్. ఆదిత్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి.) హైదరాబాద్ రీజన్ అడ్వయిజరీ ప్యానెల్ సభ్యునిగానూ నియమితులయ్యారు. వి.ఎన్. ఆదిత్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నిర్మాతలు బర్త్ డే పోస్టర్స్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు.
వి. ఎన్. ఆదిత్య బ్యాక్ టు బ్యాక్ మూవీస్!
