NTV Telugu Site icon

World Emoji Day: ఎమోజీ అంటే ఏంటి? వాటిని ఎందుకు వాడతాం?

World Emoji Day

World Emoji Day

World Emoji Day: సోషల్ మీడియాలో మన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు చాలా మంది ఎమోజీలను వాడుతుంటారు. అయితే ఎమోజీ అంటే ఏంటో ఇప్పటికీ చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. పూర్వకాలంలో ఆదిమానవులు సైగలతోనే మాట్లాడుకునే వాళ్లు. తర్వాత కాలం మారుతున్న కొద్దీ మాటలు, పాటలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎమోజీల యుగం నడుస్తోంది. ఎమోజీ ఉంటే మాట్లాడే అవసరం ఉండదు. అందుకే ఇప్పుడు చాలా మంది చాటింగ్ చేసుకునే సమయంలో మాటల బదులు ఎమోజీలను వాడుతున్నారు. కోపం వస్తే, నవ్వితే, అలిగితే, ఏడిస్తే, బాధపడితే, తినాలనిపిస్తే, ప్రేమ, సిగ్గుపడటం… ఇలా అన్ని రకాల భావాలను ఎమోజీల ద్వారానే వ్యక్తపరుస్తున్నారు. సోషల్ మీడియా నుంచి ఎస్‌ఎంఎస్‌ల వరకూ మన భావోద్వేగాలను ఎదుటివారికి తెలియజేయాలంటే ఎమోజీలనే వాడేస్తున్నారు.

మాట్లాడే అవసరం లేకుండా భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో ఎమోజీ బాగా పాపులర్‌ అయ్యింది. అందుకే 2014 నుంచి ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకుంటున్నారు. అయితే ఏ భాష ఎప్పుడు పుట్టిందో ఎవరూ కరెక్టుగా చెప్పలేరు. ఎమోజీ కూడా ఎలా పుట్టింది.. ఎక్కడ పుట్టిందో స్పష్టంగా చెప్పలేం. కానీ రికార్డులను పరిశీలిస్తే ఎమోజీకి 1999లో మొదట జపాన్‌లోని ఎన్​టీటీ డొకొమొ అనే ఒక సెల్​ఫోన్ కంపెనీ ప్రాణం పోసింది. షిగెటక కురిట అనే వ్యక్తి వీటిని తయారు చేశాడు. మాటలతో సంబంధం లేకుండా వివిధ భావాలను చెప్పే176 ఎమోజీలను తెచ్చాడు. నిజానికి ఎమోజీల కంటే ముందే 1982లో ఎమోటికాన్స్​ వచ్చాయి. ఎమోషన్, ఐకాన్‌ను కలిపి ఎమోటికాన్స్ అని పిలుస్తారు. వీటిని స్కాట్​ పల్మన్​ అనే అమెరికన్​ కంప్యూటర్ సైంటిస్ట్​ తయారు చేశాడు.

Read Also: global Condom Market: అవి తెగవాడేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

జీమెయిల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి అందుబాటులోకి రాకముందు ఎక్కువ మంది యాహూ మెయిల్, యాహూ మెసెంజర్‌లను ఉపయోగించేవారు. చాటింగ్‌లో ఎదుటి వ్యక్తి కనిపించరు కాబట్టి.. వారి హవభావాలు తెలిసేందుకు వీలుగా యాహూ ఈ ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. 2010 తర్వాత ఈ ఎమోజీలు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోకి కూడా వచ్చి చేరాయి. అయితే ఎమోజీలు, వాటిలోని రకాలు, అవి చెప్పే అర్థాల గురించి 2014లో జెరెమీ బర్గ్​ అనే ఆయన ‘ఎమోజీపీడియా’ అనే వెబ్‌సైట్​ పెట్టాడు. ఆయనే జులై 17ను ‘వరల్డ్​ ఎమోజీ డే’ అని మొదట చెప్పాడు. ప్రస్తుతం ‘ఎమోజీపీడియా’ ప్రకారం మొత్తం 1800కు పైగా ఎమోజీలు ఉన్నాయి. ఇందులో ఫేస్​ ఎమోజీలు, ఫుడ్​, ట్రీస్​, హౌసెస్​, స్పోర్ట్స్ కిట్స్, రూట్స్​ వంటివన్నీ కనిపిస్తాయి.

కాగా వరల్డ్‌ ఎమోజీ సందర్భంగా అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ బంబుల్ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కరోనా కారణంగా ఎమోజీల వినియోగం 2020 నుంచి 2021 మధ్యకాలంలో 86 శాతానికి పెరగడంతో పాటు సోషల్‌ మీడియా, ఇతర సైట్లలో యాక్టివ్‌గా ఉన్నట్లు నిర్ధారించింది. భారతీయులు ఎక్కువగా క్లాసిక్‌ రెడ్‌ హార్ట్‌ ఎమోజీని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ ఎమోజీని వాడేవారిలో ఎక్కువగా యువత ఉంటుందని జంబుల్ సంస్థ వివరించింది. ప్రస్తుతం ఇండియాలో వాడుతున్న టాప్-5 ఎమోజీలను పరిశీలిస్తే.. రెడ్‌ హార్ట్‌, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్‌ గ్లాసెస్‌ ఎమోజీ, కళ్లతో నవ్వే స్మైల్‌ను వినియోగిస‍్తున్నారు.