Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Snake

Snake

Home Safety Tips: వర్షాకాలం, వేసవి కాలం వస్తే చాలు.. ఇళ్లలోకి పాములు వచ్చాయనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం. సాధారణంగా చీకటి, చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూనే పాములు ఇళ్లలోకి వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ, అది మాత్రమే నిజం కాదు. మనం అసలు ఊహించని కొన్ని ప్రత్యేకమైన వాసనలు కూడా పాములను మన ఇంట్లోకి ఆకర్షిస్తాయని మీకు తెలుసా?

పాములకు చూపు కంటే ఘ్రాణశక్తి (వాసన చూసే శక్తి) చాలా ఎక్కువ. అవి తమ నాలుక సహాయంతో గాలిలోని వాసనలను పసిగట్టి, ఆహారం ఉన్న చోటికి లేదా తమకు ఇష్టమైన ప్రదేశాలకు చాలా సులువుగా చేరుకుంటాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే ఎలుకలు, బల్లులు, కప్పలు వంటివి పాములకు అత్యంత ఇష్టమైన ఆహారం. ఇళ్లలో ఎలుకలు తిరగడం వల్ల వచ్చే వాసన, వాటి మలమూత్రాల వాసనను పాములు చాలా వేగంగా పసిగడతాయి. అలాగే ఇంట్లో పెరటి కోళ్లు, పెంపుడు పక్షులు, కుందేళ్లు ఉన్నప్పుడు.. వాటి వ్యర్థాలు, ఈకలు, ఆహారం నుంచి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. పక్షుల గూళ్లలోని గ్రుడ్ల వాసనను పసిగట్టి కూడా పాములు గోడలు, కప్పుల ద్వారా ఇంట్లోకి దూరిపోతాయి. వీటితో పాటు తోటలో లేదా ఇంటి మూలల్లో కుళ్ళిపోతున్న తడి ఆకులు, చెత్తాచెదారం, చెక్క దిమ్మెలు, ఇళ్లలోని సీలన్ (తేమ) వాసనలు పాములకు సురక్షితమైన తావుగా అనిపిస్తాయి. ఈ వాసనలన్నీ మనం తెలియకుండానే పాములకు ఆహ్వానం పలికినట్లవుతాయి.

ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటగా ఇంట్లో ఎలుకలు, బల్లులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి, దీనివల్ల పాములకు ఆహారంతో పాటు ఆ వాసన కూడా దొరకదు. ఇంటి బాత్‌రూమ్‌లు, బేస్‌మెంట్లు, మూలల్లో తేమ లేకుండా పొడిగా ఉంచుకోవాలి. ఇంటి మురుగునీటి కాలువలు, ప్రధాన ద్వారాలు, గార్డెన్ పరిసరాల్లో ఫినాయిల్ లేదా కిరోసిన్ చల్లడం వల్ల, ఆ ఘాటైన వాసనకు పాములు దరిదాపుల్లోకి రావు. అలాగే ఇంటి చుట్టూ ఎండుటాకులు, కలప పోగులు పడనీయకుండా శుభ్రంగా ఉంచుకుంటూ, గార్డెన్‌లోని గడ్డిని ఎప్పటికప్పుడు చిన్నగా కత్తిరిస్తే పాములు దాక్కోవడానికి స్థలం ఉండదు.