NTV Telugu Site icon

Mukesh Ambani statement on Jio 5G: దీపావళి నాటికి జియో 5జీ. 2 లక్షల కోట్ల పెట్టుబడి. ఏజీఎంలో ముఖేష్‌ అంబానీ వెల్లడి

Mukesh Ambani Statement On Jio 5g

Mukesh Ambani Statement On Jio 5g

Mukesh Ambani statement on Jio 5G: హైస్పీడ్‌ 5జీ స్పెక్ట్రం సర్వీసులను ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి తేనున్నట్లు రిలయెన్స్‌ జియో సంస్థ ప్రకటించింది. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయెన్స్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆన్‌లైన్‌లో జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన కంపెనీ షేర్‌ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు. 5జీ సర్వీసులను మరో 18 నెలల్లో అంటే 2023 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా ప్రతి టౌన్‌, తాలూకా, మండల స్థాయిలోకి విస్తరించనున్నట్లు వెల్లడించారు. 5జీ టెక్నాలజీలో లేటెస్ట్‌ వెర్షన్‌ అయిన స్టాండలోన్‌ 5జీని యూజర్లకు అందిస్తామని చెప్పారు. 5జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం ఏకంగా రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఈ ఏజీఎం సమావేశాన్ని మెటావర్స్‌, జియోమీట్‌ యాప్‌తోపాటు వివిధ సోషల్‌ మీడియా వేదికలపై ప్రత్యక్ష ప్రసారం చేయటం విశేషం.

First Water School in Hyderabad: హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి వాటర్‌ స్కూల్‌

వర్చువల్‌ రియాల్టీ, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒక సంస్థ ఏజీఎం లైవ్‌ రావటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చని అంటున్నారు. 5జీ స్పెక్ట్రం కోసం ఇటీవల జరిగిన వేలంలో రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కి చెందిన రిలయెన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ టాప్‌ బిడ్డర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ సర్వీసులను ఎప్పటినుంచి ప్రారంభించనున్నారనేదానిపై ఇన్వెస్టర్లలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ముఖేష్‌ అంబానీ ఎప్పుడు ప్రకటన చేస్తారా అని వాళ్లు ఎదురుచూశారు. ఎట్టకేలకు స్టేట్‌మెంట్‌ రావటంతో పెట్టుబడిదారులకు క్లారిటీ వచ్చింది. ఇదిలాఉండగా.. ప్రారంభమైన ఆరేళ్లలోనే జియో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అతితక్కువ కాలంలోనే అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌గా ఎదిగింది. తక్కువ ధరకు హైక్వాలిటీ డిజిటల్‌ సర్వీసును అందించటం ద్వారా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. 40 కోట్లకుపైగా కస్టమర్లను సంపాదించి యూజర్ల సంఖ్యలో టాప్‌లో నిలిచింది. 5జీ సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తే వినియోగదారుల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు.