Groom Rejects Dowry Offer Worth Crores: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆ తండ్రి కష్టపడాల్సిందే. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. పెళ్లి విషయానికి వస్తే కట్నం ఎంత అని అడగడం పరిపాటిగా మారింది. కొంతమంది వరులు చాలా గట్టిగా కట్నం డిమాండ్ చేస్తారు. వరుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడంటే చాలు.. భూములు అమ్ముకోవాల్సి వస్తోంది. అంతే.. పెళ్లయిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తే.. తట్టుకోలేక వివాహితలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చిన ఈ వరకట్నం విషయంలో మాత్రం పాత సంప్రదాయాలే కొనసాగుతుండటం బాధాకరం. కట్నం ఇవ్వనందుకు రద్దయిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం కట్నం వద్దన్నందుకు పెళ్లి రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కథనం సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్‌ఇట్ లో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఓ పోస్ట్ ప్రకారం.. అతడు ఓ 27 ఏళ్ల యువకుడు. తన కుటుంబానికి రియలెస్టేట్, ఆతిథ్య రంగంలో పలు వ్యాపారాలు ఉన్నాయి. పెద్దల నుంచి వచ్చి ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఆ యువకుడు సైతం రూ.50 లక్షలపైగా సంపాదిస్తున్నాడు. తన వద్ద ఓ బీఎమ్‌డబ్యూ కారు సైతం ఉంది. తాజాగా ఆ యువకుడికి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. ఆ యువకుడికి వధువు నచ్చింది. వధువుకు కెరీర్‌తో పాటు కుటుంబానికి సమప్రాధాన్యం ఇస్తుందట. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు పెళ్లి అంశంపై చర్చించారు. ఇంతలో కట్నం ప్రస్తావన వచ్చింది. ఓ డూప్లెక్స్ ఫ్లాట్, ఓ రేంజ్ రోవర్ కారు ఇచ్చేందుకు వదువు తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కానీ.. ఇంకా ఏమైనా కావాలా? అని కాబోయే అల్లుడిని అడిగాడు. ఆ యువకుడు మాత్రం కట్నం వద్దని సున్నితంగా తిరస్కరించాడు. ఈ వార్త వినగానే కాబోయే మామ ఎగిరి గంతేయాల్సింది పోయి.. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ‘అతడు కట్నం వద్దంటున్నాడంటే ఏదో లోపం ఉన్నట్టే. ఉన్నత వ్యక్తులకు తమ విలువపై స్పష్టమైన అంచనా ఉంటుంది. వీవో, షావొమీ ఫోన్లు రూ.20 వేలకే వస్తుంటాయి. కానీ జనాలు లక్షలు పోసి ఐఫోన్‌లు కొనుగోలు చేస్తున్నందుకు కారణం ఇదే’ అని రివర్స్ లాజిక్ ప్రయోగించాడు. ఈ అంశం సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పంచుకున్నారు. ఈ పోస్ట్ చూడగానే చాలా మంది కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు.
