NTV Telugu Site icon

YVS Chowdary: గురువుకు తగ్గ శిష్యుడు.. వైవిఎస్ చౌదరి బర్త్ డే స్పెషల్!

YVS Chowdary Birthday Special

ఏ రంగంలోనైనా ప్రఖ్యాతి గాంచిన వారివద్ద పనిచేసి, వారికి తగిన శిష్యులు అనిపించుకోవడం అంత సులువు కాదు. తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే – ‘గురువు గారు’ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే! ఆయన శిష్యప్రశిష్యులు తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నారు. అదే తీరున ఆయన సమకాలికులైన కె.రాఘవేంద్రరావు శిష్యగణం కూడా తెలుగు సినిమా రంగంలో అలరిస్తూనే ఉన్నారు. రాఘవేంద్రుని శిష్యుల్లో ఎందరో జైత్రయాత్రలు చేశారు. గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. వారిలో వైవిఎస్ చౌదరితో ఆయనది ప్రత్యేకబంధం! ఎలాగంటే రాఘవేంద్రరావు, వైవిఎస్ చౌదరి ఇద్దరి బర్త్ డే మే 23న కావడం విశేషం! గురువు రాఘవేంద్రరావు లాగే పాటల చిత్రీకరణలో చౌదరి సైతం తనదైన బాణీ పలికించాడు.

నటరత్న యన్టీఆర్ కు వీరాభిమాని వైవిఎస్ చౌదరి. బాల్యం నుంచీ రామారావు చిత్రాలు చూస్తూ పెరిగిన చౌదరి చదువులోనూ చురుకైనవాడు. ర్యాంక్ స్టూడెంట్. అయితే ఇంజనీరింగ్ చేయాలనుకున్న చౌదరి మనసును సినిమా రంగం పట్టేసింది. తన అభిమాన నటుడు యన్టీఆర్ తో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన కె.రాఘవేంద్రరావును ఎంతగానో అభిమానించేవారు వైవిఎస్. దాంతో మద్రాసు వెళ్ళి రాఘవేంద్రరావును కలసి, ఆయన వద్ద అసోసియేట్ గా పనిచేస్తానని కోరారు. అప్పటికే రాఘవేంద్రరావు వద్ద 17 మంది అసోసియేట్స్ ఉన్నారు. అందువల్ల తరువాత చూద్దాం లే అన్నారు రాఘవేంద్రరావు. అయితే వైవిఎస్ మాత్రం పట్టువదలని విక్రమార్కునిలా పదమూడు రోజులు రాఘవేంద్రరావు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కరుణించిన రాఘవేంద్రరావు, చౌదరి దస్తూరీ పరీక్షించారు. చౌదరి చేతిరాత చూసి, తన వద్ద సహాయ దర్శకునిగా స్థానం కల్పించారు. చిత్రమేంటంటే, యన్టీఆర్ కు వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి, రామారావు తనయులు నిర్మించిన సొంత చిత్రం ‘పట్టాభిషేకం’ ద్వారా అసోసియేట్ గా చేరాడు. ఆ తరువాత రాఘవేంద్రరావు వద్ద పలు చిత్రాలకు అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా పనిచేశారు చౌదరి.

చదువుకొనే రోజుల్లో యన్టీఆర్ ను వీరలెవెల్లో అభిమానిస్తూ, ఏయన్నార్ ను ద్వేషించిన చౌదరికి, అక్కినేని తనయుడు నాగార్జున దర్శకునిగా అవకాశం కల్పించారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం ద్వారా వైవిఎస్ చౌదరిని దర్శకునిగా పరిచయం చేశారు నాగార్జున. మరింత విశేషమేమంటే, చౌదరి తన తొలి చిత్రంలోనే ఏయన్నార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. చిత్రసీమలోకి వచ్చాక యన్టీఆర్, ఏయన్నార్ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్న చౌదరి, ఆ ఇద్దరు మహానటుల వారసులు హరికృష్ణ, నాగార్జునతో ‘సీతారామరాజు’ చిత్రం తెరకెక్కించి అలరించారు. కృష్ణ నటవారసుడు మహేశ్ తో ‘యువరాజు’ తీసి ఆకట్టుకున్నారు. నందమూరి హరికృష్ణను హీరోని చేసి “లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య” చిత్రాలు తెరకెక్కించి మంచి విజయం సాధించారు. రామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘దేవదాస్’ రూపొందించారు. ఈ సినిమా డైరెక్టుగా 200 రోజులు ప్రదర్శితమై జనాన్ని ఎంతగానో అలరించింది. ఇలా తన చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసిన చౌదరి ఇప్పుడు మునుపటిలా సినిమాలు రూపొందించడం లేదు. ఆ పై ఆయన రూపొందించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మళ్ళీ వైవిఎస్ చౌదరి తన చిత్రాలతో అలరిస్తారని ఆయనను అభిమానించేవారు భావిస్తున్నారు. మరి అదెప్పుడో చూడాలి!