Site icon NTV Telugu

పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు ఆమోదించాలి.. విజయసాయి

ఏపీ ప్రజల పాలిట వరప్రదాయిని పోలవరం ప్రాజెక్ట్. రాజ్యసభలో డ్యాం సేఫ్టీ బిల్లు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించేందుకు తీవ్ర కాలయాపన జరుగుతోందన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని 31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే 776 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. వీటి ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి చేరాయని, ధవళేశ్వరం, ప్రకాశం, తోటపల్లి డ్యాంలు, తదితర ప్రాజెక్టులు చాలా పురాతనమైనవన్నారు. “డ్యాం సేఫ్టీ బిల్లు” అత్యంత అవసరం అన్నారు. డ్యాంల రక్షణ చాలా ముఖ్యమైనదని, “డ్యాంల నేషనల్ డేటాబేస్‌” అందుబాటులో ఉంచాలని విజయసాయిరెడ్డి కోరారు.

దిగువ రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ కు రావలసిన న్యాయమైన జలాల వాటా దక్కడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర రైతులకు న్యాయం జరగాలంటే నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు న్యాయమైన వాటా దక్కాల్సిందే అని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయిరెడ్డి.

Exit mobile version