ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే కి సర్వం సిద్ధం అవుతోంది. జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపకల్పన చేశారు.
సీఎం జగన్ పై ప్రత్యేకంగా పాటలు సిద్ధం చేయించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పాటల వీడియో విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, ఇతర నేతలు ఫిదా అయ్యారు. ఈ పాట వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మేమందరం అనుకున్న మాటలనే పాటకు రూపం ఇచ్చారు. దీర్ఘకాలంలో పేద ప్రజల జీవితాలను మార్చే విధంగా జగన్ పాలన చేస్తున్నారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలకు ఆనందకరమైన జీవితాలను ఇస్తున్నారు. ప్రజల్లో ఉన్న రూపాన్ని గ్రీన్ ఆర్ట్ లో చక్కగా రూపొందించారు. జగన్ కు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సజ్జల.