ఎట్టకేలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టిన అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజల్ట్ ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అన్ని జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే ధీమా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జెడ్పీటీసీ ఛైర్మన్ల పేర్లను సైతం ఖారారు చేసినట్లు సమాచారం అందుతోంది.
పదవుల పంపకం విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి సామాజిక సమీకరణాలను ఫాలో అవుతున్నారు. మున్సిపాలిటీ ఛైర్మన్, కార్పొరేషన్ల మేయర్ల ఎంపికలోనూ వైసీపీ ఇదే ఫార్మూలాను ప్రయోగించింది. దీంతో జెడ్పీటీసీ ఛైర్మన్లు, ఎంపీపీల ఎంపిక విషయంలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే పంథాను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు కావడంతో ఆమేరకు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదించినట్లు తెలుస్తోంది. ఫలితాలు తర్వాత ఎవరూ కీచులాడుకోకుండా ముందస్తుగా లిస్టు ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఎంపీపీ విషయంలో పార్టీ తొలి నుంచి ఫాలో అవుతున్న ఫార్ములానే అమలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది ఆదివారం ఫలితాల వెల్లడైన తర్వాత పార్టీ జిల్లాల సమన్వయకర్తలతోపాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలు తీసుకొని సామాజిక సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో మాదిరిగానే ఎంపీపీ పదవుల విషయంలోనూ వారి కోటాను వారికే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎంపీపీ పదవుల పంపకంలో ఎవరెవరీకి పదవులు దక్కుతాయనేది మాత్రం ఫలితాల వెల్లడి తర్వాతే డిసైడ్ కానుంది.
కొత్త జెడ్పీటీసీ ఛైర్మన్ల విషయంలో చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు ఇప్పటికే ఖరారు కాగా మరికొందరి పేర్లు ఈరోజు ఖరారు కానున్నాయి. వీరిలో విజయనగరం జెడ్పీఛైర్మన్ గా మజ్జి శ్రీనివాసరావుకు, విశాఖపట్టణం నుంచి శివరత్నం, గుంటూరు నుంచి క్రిస్టినా, ప్రకాశం నుంచి బూచేపల్లి వెంకాయమ్మ, పశ్చిమగోదావరి నుంచి కవురు శ్రీనివాస, కృష్ణా నుంచి ఉప్పాళ్ల హారిక, కడప నుంచి ఆకేపాటి అమర్నాధరెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
నెల్లూరు నుంచి ఆనం అరుణమ్మ, చిత్తూరు నుంచి శ్రీనివాసులతోపాటు మంత్రి పెద్దిరెడ్డి బంధు పేర్లు విన్పిస్తున్నాయి. అలాగే తూర్పు గోదావరి నుంచి విప్పర్తి వేణుగోపాల్, అనంతపురం నుంచి గిరిజ పేర్లు విన్పిస్తున్నాయి. కదిరి నుంచి పోటీ చేసిన జక్కల ఆదిశేషు భార్య , గుత్తి నుంచి పోటీలో ఉన్న ప్రవీణ్ యాదవ్ సతీమణి జెడ్పీ ఛైర్మన్ల పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో ఎర్రబోతుల వెంకటరెడ్డికి కుమారుడికి పదవి దక్కే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ మహిళకు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న మహిళకు తాజాగా నామినేటెడ్ పదవుల్లో భాగంగా పోస్టు కేటాయించారు. దీంతో ఆ తర్వాతి రేసులో ఇద్దరు మహిళల్లో ఒకరిని నేడు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి వైసీపీ ముందస్తుగానే పదవుల పంపకంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ వేవ్ కన్పించింది. ఆ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రేపటి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.