Site icon NTV Telugu

Mlc Elections: తన ఓటుపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి క్లారిటీ

Kotam New

Kotam New

తన నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీ వేదికగా నిరసన తెలుపుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత ఆయన వైసీపీకి దూరమైయ్యారు. తన నియోజవకర్గంలోనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన వ్యక్తి చేశారు. ఇప్పుడు తన నిరసనకు అసెంబ్లీని వేదిక చేసుకున్నారు. తన నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తే ఆందోళన విరమిస్తానంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ప్రభుత్వ తీరును నిరిసిస్తూ వైసీపీకి దూరమైన కోటంరెడ్డి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు హాజరయ్యే క్రమంలో ప్లకార్డుతో బయట నిరసన తెలిపారు.తన నియోజకవర్గంలో‌ని సమస్యల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు.

నాలుగేళ్ల కాలంలో సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయానని చెప్పారు. కోటంరెడ్డి తీరుపై అధికార పక్షం ఎదురు దాడి దిగింది. అయితే, కోటంరెడ్డి నిరసన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహానికి గురయ్యారు. సమస్యలను లేవనెత్తడానికి సరైన పద్ధతి తీసుకోకుండా నిరసన బాట పట్టడాన్ని స్పీకర్ తప్పుబట్టారు. ప్రశ్నలను సరైన రీతిలో లేవనెత్తి వాటిని పరిష్కరించాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కోటంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోటం రెడ్డి టీడీపీతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో సభలో కోటంరెడ్డి వర్సెస్ మంత్రి అన్నట్టుగా నెలకొంది.
Also Read:YS Viveka: వివేకా హత్యకు నాలుగేళ్లు.. వారికి శిక్ష పడాలన్న సునీత

ఇదిలా ఉంటే.. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్ధులు వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలు చేసారు. ప్రతిపక్ష టీడీపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఒక్కో అభ్యర్ధికి 23 మంది సభ్యుల మద్దతు అవసరం. టీడీపీ నుంచి ప్రస్తుతం అధికారికంగా 23 మంది ఉన్నా.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారు టీడీపీ అభ్యర్థికి కాకుండా వైసీపీ అభ్యర్థులకే ఓటే వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీని విభేదిస్తున్న నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఓటు ఏ పార్టీకి అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు. వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నా నన్నారు. దీంతో కోటంరెడ్డి ఏ పార్టీకి ఓటేస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Also Read:Karumuri Nageswara Rao: పవన్‌ ఆ విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు..? ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ జగనే సీఎం..

కాగా, గత కొద్ది రోజులుగా కోటంరెడ్డి టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ సభ్యులు సైతం ఈ వాదన చేస్తున్నారు. అయితే, టీడీపీలో చేరికపై కోటంరెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పై పోటీ చేస్తారని నెల్లూరు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి చేరికను టీడీపీ శ్రేణులు కూడా అభ్యంతరం వ్యక్తంచేయడం లేదని తెలుస్తోంది.

Exit mobile version