గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ బాట పడుతున్నారు.
Read Also: హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్! భారీగా రెమ్యూనరేషన్!!
ఇదే సమయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్… అక్టోబర్ మాసం వరకూ వేచి ఉండమని, తొందరపడి ఓటీటీలో సినిమాలను విడుదల చేయవద్దని నిర్మాతలను కోరింది. అప్పటికీ థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోతే… ఓటీటీలో విడుదల చేసుకోమని సలహా ఇచ్చింది. అదే సమయంలో సినిమా టిక్కెట్ రేట్లను పెంచకపోతే… థియేటర్ల మనుగడ కష్టమని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది.
చిత్రంగా ఇది జరిగిన రెండు రోజులకే ఆంధ్రప్రదేశ్ సర్కార్ యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ నెల 8 నుండి థియేటర్లు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే అక్కడ రాత్రి కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. సో… సెకండ్ షోస్ ను ప్రదర్శించే ఆస్కారం లేదు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుండి రాత్రి 7 గంటల వరకే కర్ఫ్యూను సడలించారు. అక్కడ ఫస్ట్ షోస్ వేయడానికీ అవకాశం ఉండదు. ఇక తెలంగాణ ప్రభుత్వం నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను గత నెల 20 నుండే తెరుచుకోవచ్చునని ఆదేశాలు జారీ చేసింది. కానీ థియేటర్లు తెరుచుకున్నంత మాత్రాన తమ సమస్యలకు పరిష్కరం దొరకదని ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ భావిస్తున్నారు.
Read Also: విడాకుల విచారంలో ఆమీర్! ‘దంగల్’ ఖాన్ కి ‘దబంగ్’ ఖాన్ ఓదార్పు!
ఇదే విషయమై తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో సురేశ్ బాబు, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ తదితరులు సమావేశమయ్యారు. సినిమా థియేటర్ల రీ-ఓపెనింగ్ లోని ఇబ్బందులను వివరించారు. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచినప్పుడు, అలానే నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ కోరిక మేరకు టిక్కెట్ రేట్లను పెంచినప్పుడు మాత్రమే పెద్ద సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సో… ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా పాత సినిమాలు, చిన్న సినిమాలతో కాలక్షేపం చేయాల్సిందే!
