Site icon NTV Telugu

దళిత “బంధు”కు బ్రేక్‌..ఎవరికి నష్టం?

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఈటలకు ఇది చావో రేవో ..కాగా కేసీఆర్‌ ప్రతిష్టకు అతి పెద్ద సవాలు. ఐతే ప్రస్తుతం ఓటరు ఎటు వైపు అన్నదిఎవరికి వారు గెలుపు తమదే అన్న విశ్వాసంతో ఉన్నారు. అయితే ఏం జరుగుతుందో ఈ నెల 30న హుజూరాబాద్‌ ఓటరు నిర్ణయిస్తాడు. అప్పటి వరకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హోరా హోరీ తప్పదు.

హుజూరాబాద్‌ ప్రజలు పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక్కడ జరుగుతున్నది ముక్కోణ పోటీయే అయినా వార్‌ బీజేపీ ..టీఆర్‌ఎస్‌ మధ్యనే. రెండు క్యాంపులు భారీగా శ్రేణులను మోహరించాయి. ఒకరిపై ఒకరు వాక్బాణాలు సంధించుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడు హుజూరాబాద్‌లో పరిస్థితి గంభీరంగా..వాడివేడిగా ఉంది. ఈ సమయంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే దాకా నియోజకవర్గంలో దళిత బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాజా పరిణామం ఇటు దళిత బంధు లబ్ధిదారులతో పాటు.. సీఎం కేసీఆర్‌ను కూడా నిరాశకు గురిచేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నిబంధనలను ఎవరూ కాదనలేము. ఐతే, ఈసీ నిర్ణయం నుంచి ఎలా ప్రయోజనం పొందాలని అధికార పార్టీ చూస్తోంది. దళిత బంధు అమలును ఆపాలని బీజేపీ నేతలు ఈసీకి లేఖలు రాశారన్న ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో దీనిపై విపరీతంగా ప్రచారం చేసింది. ఇప్పుడు అదే అధికార పార్టీకి అక్కరకు వచ్చేలా వుంది. మరో వైపు బీజేపీ ఆందోళన కూడా అదే. ప్రస్తుతం అది దీనిని నుంచి బయటపడే మార్గం కోసం చూస్తోంది.

దళిత బంధు స్కీం సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు కేవలం కొన్ని రోజుల ముందు ఈ పథకం ప్రారంభమైంది. ప్రస్తుతం దీనిని హూజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతోంది. దాదాపు 24 వేలకు పైగా కుటుంబాలను లబ్ధిదారులుగా గుర్తించారు. రెండు వేల కోట్లు దీనికోసం ప్రభుత్వం విడుదల చేసింది. 16 వేల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 1,655 కోట్లు జమైంది. ఈ నేపథ్యంలో కేవలం హుజురాబాద్‌ ఎన్నికల కోసమే హడావుడిగా దళితబంధు తెచ్చారన్న విమర్శలు వచ్చాయి. ఐతే, ఇది ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదని సీఎం కేసీఆర్‌ పదే పదే చెపుతూ వచ్చారు.

ఉపఎన్నికల నేపథ్యంలో దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలంటూ పై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చేసిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దాంతో ఉప ఎన్నిక ముగిసేంత వరకు నియోజకవర్గంలో నగదు బదిలీ ప్రక్రియ మొత్తాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చాలా రోజుల క్రితమే ఆ ఫిర్యాదు చేసింది. ఐతే ఇన్ని రోజుల తరువాత దానిని నిలిపివేయటం ఏమిటి? రాష్ట్ర ఎన్నికల అధికారి ఫిర్యాదుపై ఎందుకు ఆలస్యంగా లేఖ రాశారు? మూడు వంతుల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయి..తీరా ఎన్నికలు దగ్గరకొచ్చాక ఆపేయాలని నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమే.

దళిత బంధుకు బ్రేక్‌ పడటంపై బీజేపీ స్పందించింది. సీఎం కేసీఆర్ చేతకాని తనం వల్లే ఎన్నికల కమిషన్ ఆపేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ దళిత బంధును పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కుల సంఘాలను చీల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అక్కౌంట్లో జమ అయిన డబ్బును ఫ్రీజ్‌ చేయటమేంటని ఎద్దేవా చేశారాయన.

దళితబంధు వల్ల ఎస్సీ ఓట్లు అధికార పార్టీ వైపు వెళితే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. లక్షా రెండు లక్షలా..ఏకంగా పది లక్షల రూపాయలు. ఓటరు నోటుకు అమ్ముడు పోతున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతున్నప్పుడు అధికార పార్టీకి ఆమాత్రం చేయలేరా? దళిత బంధు ఖచ్చితంగా టీఆర్‌ఎస్‌ కు అడ్వాంటేజ్‌. ఐతే, ఇదే సమయంలో ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తికి కారణమైంది. ముఖ్యంగా బీసీలలో. ఇప్పుడు దళితబంధు టీఆర్‌ఎస్‌కు అడ్వాంటేజా ..డిస్‌ అడ్వాంటేజా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పుడు హటాత్తుగా పథకానికి బ్రేక్‌ పడటం అధికార పార్టీని గందరగోళంలో పడేసే ప్రమాదం ఉంది.

మొత్తానికి తాజా పరిణామంతో టిఆర్ఎస్ , బిజెపిల మద్య మాటల యుద్ధం తీవ్రమైంది.దీని వెనక బిజెపి ఉందని..అది దళిత ద్రోహి అని టిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. మరవైపు, పక్కా స్కెచ్ ప్రకారమే కెసిఆర్ ఇదంతా చేశారని కమలదళం అంటోంది. ఇదిలావుంటే, దళిత బంధుపై తాను లేఖ రాసినట్లు నిరూపించాలని టీఆర్‌ఎస్‌కు సవాల్‌ చేశారు ఈటల. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా కాకపుట్టిస్తున్నాయన్నది నిజం.

Exit mobile version