సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా గ్రాం సంచలనంగా మారాయి. వాట్సాప్ ద్వారా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి వేగంగా చేరవేయగలుగుతాం. వాట్సాప్‌లో గ్రూప్‌లు క్రియేట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసే కొన్ని పోస్టులు గ్రూప్ అడ్మిన్‌లను చిక్కుల్లో పడేస్తుంటాయి. కోర్టుల దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఒకవేళ గ్రూప్‌లోంచి సదరు మెసేజ్ డిలీట్ చేయాలంటే సాధ్యంకాదు. దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే సదరు మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశం వుంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకే గ్రూప్ అడ్మిన్‌ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది.
ఈ ఫీచర్‌తో గ్రూప్‌లో షేర్ చేసే పోస్టులను అడ్మిన్‌లు డిలీట్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ నిర్వాహకులు తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసిన టెక్ట్స్, ఫొటో, వీడియో, డాక్యుమెంట్ ఫైల్‌లను డిలీట్ చేయాలా.. వద్దా అనేది ఇక మీదట గ్రూప్ అడ్మిన్‌లు నిర్ణయిస్తారు. ఒకవేళ అభ్యంతరకరమైన మెసేజ్‌లను గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేస్తే.. గ్రూప్ చాట్ పేజీలో ‘గ్రూప్ అడ్మిన్ దాన్ని తొలగించారు’ అనే మెసేజ్ కనిపిస్తుంది. గ్రూప్‌కు ఒకరికి మించి ఎక్కువమంది అడ్మిన్‌లుగా ఉన్నా.. ఈ ఫీచర్‌తో వారందరూ మెసేజ్‌లను డిలీట్ చేయవచ్చు.
గ్రూప్ ఆసక్తికి విరుద్ధంగా ఉన్న అనేక మెసేజ్‌లను అడ్మిన్లు ఎంతో సులువుగా తొలగించే అవకాశం రాబోతోంది. దీంతోపాటు వాట్సాప్ ‘డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్స్ తాము పంపిన మెసేజ్‌ను షెడ్యూల్ చేసి ఎంత సేపు వుండాలో నిర్ణయించవచ్చు. టైమ్ లిమిట్ ద్వారా దాన్ని తొలగించవచ్చు. గతంలో వాట్సాప్ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్ 7 నిమిషాలే. త్వరలో గంట, 8 నిమిషాలు, 16 సెకన్లు నిర్ణయించనున్నారు. వీటితో పాటు 2022లో మరెన్నో కొత్త ఫీచర్స్ రానున్నాయి. వాట్సాప్ ప్లేయర్, ఆడియో మెసేజ్ ప్రివ్యూ, కమ్యూనిటీ వంటి మరికొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి.