గ్యాస్ సిలిండర్ లో ఏముంటుంది? ఏంటీ పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ వుంటుంది. ఆయా సిలిండర్ల బరువును బట్టి గ్యాస్ నింపి వుంటుంది. కానీ కొన్ని గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ మాయం అవుతూ వుంటుంది. కానీ గ్యాస్ సిలిండర్లో నీళ్ళు మీరెప్పుడైనా చూశారా. అవును ఇది నిజం, గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడిపై గుదిబండగా మారిన వేళ నీళ్ళు వస్తే ఆ వినియోగదారుడి పరిస్థితి ఎలా వుంటుందో మీరే ఊహించండి.
గ్యాస్ బండ కొన్న వినియోగదారుడికి విచిత్ర పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ త్వరగా అయిపోవడం, గ్యాస్ కి బదులు నీళ్ళు రావడంతో ఏం చేయాలో తెలీలేదు ఆ వినియోగదారుడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన శ్రీనివాసరావు గ్యాస్ బుక్ చేసుకున్నాడు. వేటపాలెం గ్యాస్ ఏజన్సీ నుంచి సిలిండర్ ఇంటికి వచ్చింది. డబ్బులు చెల్లించి గ్యాస్ వంటగదిలో పెట్టి వాడుకోవడం మొదలు పెట్టారు. కానీ ఆ సిలిండర్ వాడిన పది రోజులకే అయిపోవడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. గ్యాస్ అవ్వడమేంటని చూస్తే… బండలో నుంచి వాటర్ బయటకు వస్తూ కనిపించాయి. దీంతో ఏం జరిగిందో అని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించారు. కొన్ని సిలిండర్లు నీళ్ళతో వస్తున్నాయని… వేరేది ఇస్తామని సెలవిచ్చారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు.