NTV Telugu Site icon

హుజురాబాద్‌ చిత్రాలు.. డబ్బులు ఇవ్వలేదని ఓటర్ల రాస్తారోకో..!

తెలంగాణ ప్రజలు మొత్తం హుజురాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.. ఇప్పటికే ప్రచార పర్వానికి తెరపడగా.. ప్రలోభాలకు తెరలేపారు.. వాస్తవానికి హుజురాబాద్‌లో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్‌లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట.. మరికొంత మందికి మరిచారో మరి మళ్లీ వస్తారో తెలియదు.. కానీ, ఈలోపే ఓటర్లు నిరసనకు దిగారు.. తమకు డబ్బులు రాలేదని రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.. దీంతో, హుజురాబాద్ జమ్మికుంట రహదారి పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులిచ్చి మరికొందరిని వదిలేశారని నినాదాలు చేస్తూ.. నిరసన తెలుపుతున్నారు గ్రామస్తులు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ఓపెన్‌ సీక్రెటే అయినా.. ఇప్పుడు ఓటర్లు ఆందోళనకు చేపట్టడం మాత్రం చర్చగా మారింది. హుజురాబాద్‌లో డబ్బుల ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.