NTV Telugu Site icon

నవరస నటనాసార్వభౌముడు… సత్యనారాయణ

Veteran Actor Kaikala Satyanarana Birthday Special

(జూలై 25న కైకాల సత్యనారాయణ పుట్టినరోజు)
కైకాల సత్యనారాయణ అభినయం తెలుగువారిని ఆరు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉంది. విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా – ఏది చేసినా అందులో తన మార్కు ప్రదర్శించారు సత్యనారాయణ. ఒకప్పుడు ఆయన బిజీయెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. అందరు హీరోలకు అప్పట్లో సత్యనారాయణనే విలన్. రామారావు, రంగారావు తరువాత పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన ఘనత సత్యనారాయణ సొంతం. వందలాది చిత్రాలలో సత్యనారాయణ నటన ప్రేక్షకులను రంజింప చేసింది. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రలలో జీవించడానికి సత్యనారాయణ తహతహలాడుతూనే ఉన్నారు.

కృష్ణాజిల్లా కౌతరంలో జన్మించిన సత్యనారాయణ, చదువుకొనే రోజుల్లో కొన్ని నాటకాల్లో నటించారు. డిగ్రీ పూర్తయిన తరువాత ఆయన మనసు నటనపైకి మళ్ళింది. సినిమా రంగంలో తన అదృష్టం పరీక్షించుకుందామని సత్యనారాయణ మద్రాసు వెళ్ళారు. ఓ మిత్రుని సలహా మేరకే చెన్నై చేరిన సత్యనారాయణకు ఆరంభంలోనే డి.ఎల్. నారాయణ తెరకెక్కించిన ‘సిపాయి కూతురు’లో హీరోగా నటించే అవకాశం లభించింది. ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో సత్యనారాయణ నిరాశ చెందారు. మళ్ళీ ఊరికి వెళ్ళడం ఇష్టం లేక, ఎలా అయితే అలా అయిందని మద్రాసులోనే ఉన్నారు. అసలు సత్యనారాయణను డి.ఎల్. నారాయణ తన ‘సిపాయికూతురు’లో ఎంపిక చేసుకున్నదే ఆయనకు యన్టీఆర్‌ పోలికలు ఉన్నాయని. దాంతో ఆ నోటా, ఈ నోటా పడి సత్యనారాయణ విషయం మరికొందరికి తెలిసింది. అదే సమయంలో యస్.డి.లాల్ ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ రూపొందిస్తూ అందులో ఓ కీలక పాత్రను ఇచ్చారు. యన్టీఆర్ ను కలుసుకున్న సత్యనారాయణకు ఆయన తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. ‘లవకుశ’లో భరతుని వేషం ఇప్పించారు. తరువాత తాను ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’ చిత్రంలో సత్యనారాయణనే తన డూప్ గా తీసుకున్నారు రామారావు. అంతేకాదు. ఆ చిత్రంలోని పతాక సన్నివేశాల్లో మాస్క్ షాట్స్ అవసరం లేకుండా, సత్యనారాయణనే నేరుగా నటింప చేశారు యన్టీఆర్. దాంతో సత్యనారాయణకు జనాల్లోనూ మంచి గుర్తింపు లభించింది. యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన పలు చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు సత్యనారాయణ. రామారావు తన సొంత చిత్రాలలో సత్యనారాయణకు కీలక పాత్రలు ఇస్తూ వచ్చారు. అలాగే తాను నటించిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక పాత్రను సత్యనారాయణకు ఇప్పిస్తూ వచ్చారు యన్టీఆర్. తరువాతి రోజుల్లో సత్యనారాయణ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. రామారావుతో కలసి దాదాపు వంద చిత్రాలలో నటించారు సత్యనారాయణ. ఆ నాటి మేటి హీరోలందరి చిత్రాల్లోనూ ప్రతినాయకునిగా నటించి మెప్పించారు.

వందలాది చిత్రాలలో విలన్ గా నటించిన సత్యనారాయణ కొన్ని సినిమాల్లో కేరెక్టర్ యాక్టర్ గానూ అలరించారు. నవరసాలను పోషించి ఆకట్టుకున్నారు. రామారావు, రంగారావు తరువాత రావణ, సుయోధన పాత్రల్లో మెప్పించిన ఘనుడిగా నిలిచారు సత్యనారాయణ. యన్టీఆర్ ‘శ్రీకృష్ణావతారం’లో ముందుగా యస్వీఆర్ ను దుర్యోధనుని పాత్రకు ఎంచుకున్నారు. అయితే చివరి క్షణంలో రంగారావు మరో చిత్రానికి కాల్ షీట్స్ ఇవ్వడం వల్ల, ఆ పాత్ర సత్యనారాయణకు దక్కింది. ‘శ్రీకృష్ణావతారం’లో దుర్యోధనునిగా మంచి మార్కులు సంపాదించారు. ఆ సినిమా సక్సెస్ తో సత్యనారాయణ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. అప్పటి దాకా యన్టీఆర్ కు డూప్ గా నటించిన సత్యనారాయణ, ఆయన చిత్రాల్లోనే ప్రధాన ప్రతినాయకునిగా నటించే అవకాశాలు సంపాదించారు. సత్యనారాయణ అభినయానికి అనేక అవార్డులూ, రివార్డులూ లభించాయి. ‘నటశేఖర’ బిరుదంతో పాటు ‘నవరస నటనాసార్వభౌముని’గానూ జేజేలు అందుకున్నారు సత్యనారాయణ. ‘రమా ఫిలిమ్స్’ పతాకంపై తన సోదరుడు కె.నాగేశ్వరరావు నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించారు సత్యనారాయణ. వాటిలో “గజదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్, ఇద్దరు దొంగలు, కొదమసింహం, ముద్దుల మొగుడు, బంగారు కుటుంబం” వంటి సినిమాలు ఉన్నాయి.

సత్యనారాయణ 1996లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ సమయంలో యన్టీఆర్ స్థాపించిన ‘తెలుగుదేశం’ పార్టీ టిక్కెట్ పై మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. 1998లో అదే మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు సత్యనారాయణ. 2011లో సత్యనారాయణకు ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు లభించింది. సత్యనారాయణ ఆ మధ్య ‘మహర్షి’లో ఓ బిట్ రోల్ లో కనిపించారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.