NTV Telugu Site icon

విపక్షాల తీరు.. పాపం వెంకయ్య కంటనీరు…

పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయంతే. ఏ కార్యక్రమం సరిగా సాగదు. ప్రశ్నలు లేవు.. సమాధానాలు లేవు. ఇక చర్చల ప్రసక్తే లేదు.. నినాదాలు ..ఇకటే రణగొణ ధ్వనులు . గత రెండు వారాలుగా పార్లమెంట్‌ లో ఇవి తప్ప మరొకటి ఉందా. ఇదీ మనం చూస్తున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తీరు.

పంతం నెగ్గించుకోవటానికి ప్రతిపక్ష సభ్యులు దేనికైనా సిద్ధమంటున్నారు. కాగితాలు చింపుతారు. స్పీకర్‌ వెల్‌ లోకి దూసుకెళ్తారు. చైర్మన్‌ సీట్‌పైకి ఫైల్స్‌ విసిరేస్తారు.. టేబుల్ ఎక్కి బిగ్గ నినదిస్తారు. ఇలా ఏమేం చేయగలరో అన్నిటిని ఈ సమావేశాల్లో చూశాం.

గత రెండు వారాలుగా అదే పనిగా విపక్షాలు పార్లమెంట్‌ ఉభయ సభలను అడ్డుకుంటున్నాయి. ఆందోళనల నేపథ్యంలో కార్యక్రమాలు అరంగుళం కూడా ముందు సాగలేదు. దాంతో లోక్‌సభ షెడ్యూలు కన్నా రెండు రోజుల ముందే నిరవధిక వాయిదా పడింది. నిజానికి ఈ నెల 13 వరకు సమావేశాలు జరగాలి. కాని అలా జరగకుండా ఎండ్‌ కార్డు పడింది.

ఈ వర్షాకాల సమావేశాలలో ఎన్ని గంట‌ల పాటు స‌భా కార్యక్రమాలు జరిగాయో తెలిస్తే షాకవుతారు. అనుకున్నదానిలో కేవ‌లం 22 శాతం. ఈ విషయం లోక్‌సభ స్పీకర్‌ స్వయంగా తెలిపారు. ఇక మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో చివరగా 127వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపింది.

మరోవైపు, బుధవారం రాజ్యసభలో పాత సీన్సే కనిపించాయి. సభ ఇలా మొదలయిందో లేదో అలా గొడవ. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభ్యుల ప్రవర్తనకు కంటనీరు పెట్టుకున్నారు.

మంగళవారం రాజ్యసభలో షాకింగ్‌ సీన్స్‌ కనిపించాయి.విపక్ష సభ్యులు వీరంగం వేశారు. మామూలుగా కాదు ..బల్లలు ఎక్కి అరుస్తూ చప్పట్లు చరిచారు. రూల్ బుక్ ను ఛైర్మన్ పైకి విసిరేశారు. పేపర్లు విసిరి కొట్టారు ..ఒకరికి ఒకరు వంత పాడుతూ నానా హంగామా చేశారు. అందుకే, విపక్ష సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని ప్రభుత్వం మండిపడింది. ఈ ఘటనతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర కలత చెందారు. సభ సాక్షిగా బుధవారం గద్గద స్వరంతో కంటతడి పెట్టారు. బుధవారం కూడా సభ్యుల ఆందోళనలతో సభ మార్మోగిపోయింది. దాంతో రాజ్య సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

చైర్మన్ పోడియం కూడా దేవాలయ గర్భగుడి లాంటిదే. భక్తులు గర్భగుడి వరకు రావచ్చు కానీ లోపలకు రాకూడదు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం బాధిస్తోంది. రాత్రి నిద్ర పట్టలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కాకుండా చూడాలి. అంటూ సభ్యులకు వెంకయ్య నాయుడు హితవు పలికారు. సాక్షాత్తు సభాధ్యక్షుడే కన్నీటి పర్యంతమయ్యారంటే ఎంపీల ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షం ఆందోళన చేస్తూనే ఉంది. పెగసస్‌పై చర్చ జరగాలని పట్టుబడుతోంది. పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై చర్చ, వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విపక్షాల నిరసన కొనసాగుతుండగానే..లోక్‌సభలో మూఖ్యమైన బిల్లులన్నీ ఆమోదం పొందాయి.

రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. పెగసస్ స్పైవేర్ నూతన వ్యవసాయ చట్టాలపై చర్చ జరగాల్సిందేనని రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. పదే పదే నినాదాలు చేస్తూ సభా వ్యవహారాలకు అంతరాయం కల్గించాయి. ఫలితంగా రాజ్యసభలో నిత్యం వాయిదాల పర్వం కొనసాగింది.
రాజ్యసభలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పెగాసస్‌ వ్యవహారంపై విపక్ష సభ్యులు నిరసన తెలిపారు.

పెగాస‌స్ స్పైవేర్ కుంభకోణం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాల‌ంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్‌ సభలో పత్రాలను చించివేశారు. సమావేశాల తొలి రోజుల్లో జరిగిన ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనపై వేటు పడింది. ఈ వర్షాకాల సమావేశాల కాలానికి రాజ్యసభ నుంచి శంతనును సస్పెండ్ చేశారు.

మొత్తం మీద పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు చివరి అంకానికి చేరాయి. గత నెల 19న ప్రారంభమైన ఈ సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. కరోనా రెండో దశలో ప్రభుత్వ వైఫల్యం, పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌, వ్యాక్సినేష‌న్ ప్రక్రియ, మోడీ ప్రభుత్వ వైఫల్యాలు, నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళ‌న‌లు వంటి ప‌లు అంశాల‌పై ప్రతిప‌క్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాయని అందరూ భావించారు. కానీ విపక్షాలు ఊహించని విధంగా పెగసస్‌ స్పైవేర్‌ అంశాన్ని ఎత్తుకున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్‌లో ఎంత రాద్దాంతం చేయాలో అంతా చేశాయి. సమావేశాలు మొదలైనన్పటి నుంచి సభాకార్యక్రమాలను అడ్డుకుంటేనే ఉన్నాయి. ఇంత చేసినా విపక్షాలు అనుకున్న ప్రయోజనాలను సాధించాయా అంటే ..అదీ లేదనే చెప్పాలి.

పెగసస్‌పై ఇలా గొడవచేయటం వల్ల ప్రతిపక్షాల కు రాజకీయంగా ఏమిటి ప్రయోజనం? అయితే పెగసస్‌ చర్చించాల్సిన అంశం కాదా అంటే…నూటికి నూరు శాతం చర్చించాల్సిన ముఖ్యమైన అంశమే. ప్రభుత్వాలని ప్రశ్నించే వారందరిపై పెగసస్‌తో స్సైవేర్‌ నిఘా పెడితే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా?కానీ పెగసస్‌ స్పైవేర్‌ అనేది సామాన్య ప్రజలకు అర్థం కాని అంశం. ప్రజలకు అర్థమైన సమస్యలనే ప్రతిపక్షాలు మీదేసుకుంటేనే ప్రభుత్వాలను ఇరుకున పెట్టొచ్చు.

మోడీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి విపక్షాల చేతిలో అనేక అద్భుత అస్త్రాలున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌ సంక్షోభం .గంగా నదిలో శవాల ప్రవాహం..వ్యాక్సిన్‌ ఇబ్బందులు… పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ. నింగికెగిసిన పెట్రో ధరలు. సామాన్యుడిపై అప్పుల భారం ..ఉద్యోగాల కోత ఎలా ఎన్నో ప్రజా సమస్యలతో దేశం సంక్షోభంలో ఉంది. వీటిని కాదని విపక్షం ఏరికోరి పెగసస్‌ ని పట్టుకుంది. అయినా ఆశించిన రాజకీయ ప్రయోజనం పొందటంలో విపక్షాలు ఫెయిలయ్యాయి. మరోవైపు ఈ సమావేశాల్లో వివిధ అంశాలకు సంబంధించి విపక్షాల నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో అని ఆందోళన చెందిన అధికార పక్షం పని సులువైంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు విపక్షాల వ్యవహార శైలి బీజేపీకి ప్లస్‌ అయింది.

ఆద్యంతం సభా కార్యక్రమాలు జరగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభలను అడ్డుకుంటూనే ఉన్నాయి. ఇది అన్యాయమని ప్రధానీ మోడీ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది మీరు నేర్పిన విద్యయే అంటూ గతంలో అరుణ్ జైట్లీ అన్న మాటలను గుర్తు చేస్తున్నారు ప్రతిపక్ష సభ్యులు.

ఓ సారి గతాన్ని గుర్తుచేసుకుంటే 2010 ప్రాంతంలో పార్లమెంట్‌ లో సరిగ్గా ఇలాగే జరిగింది. కాకపోతే అప్పుడు యూపీఏ అధికారంలో ఎన్‌డీఏ విపక్షంలో ఉంది. బొగ్గు కేటాయింపులు, టెలికాం కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ అప్పుడు విపక్షంలో ఉన్న బీజేపీ పార్లమెంట్‌ ని పూర్తిగా స్తంభింపచేసింది. సభాకార్యక్రమాలు అంగుళం కూడా ముందుకు సాగనివ్వలేదు. బిల్లుల ఆమోదాన్ని అడ్డుకున్నారు. దాంతో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా ఇప్పుడు మోడీలాగే ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాడు ఎన్‌డీఏ సభ్యులు పార్లమెంట్‌ ఆందోళనలను రాజ్యసభలో బీజేపీ పక్ష నేత అరుణ్‌ జైట్లీ సమర్ధిస్తూ ఏమన్నారంటే .. పార్లమెంట్‌ సహజంగా వివిధ అంశాలను చర్చించాలి కానీ ప్రధానమైన అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్లమెంట్‌ కార్యక్రమాలని అడ్డుకోవటం కూడా ఉపయోగపడుతుందని అన్నారు. సరిగ్గా విపక్షాలు ఇప్పుడు అదే చేస్తున్నాయి. ప్రతిపక్షాలను తప్పు పట్టే హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా? అలాగే కాంగ్రెస్‌ నాడు అడ్డుకోవటాన్ని వ్యతిరేకించి ఈ నాడు సమర్థిస్తోంది. అయితే నాడు బీజేపీ డిమాండ్‌ చేసిన అంశాలపై అప్పటి ప్రభుత్వం విచారణ జరిపించింది. కానీ మోడీ సర్కార్‌ కనీసం చర్చకు కూడా అంగీకరించట్లేదు.

మరోవైపు, పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ఓ వైపు పార్లమెంట్‌లో ఆందోళన జరుగుతుండగానే మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం నుంచి ఈ అంశంపై సమాధానం రావాల్సి ఉంది. దాంతో విచారణ ఆగస్టు 16కు వాయిదా పడింది. ఆరోపణలు నిజమైతే..తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, రక్షణ రంగ ప్రముఖులు, మానవ హక్కుల నేతలు తదితరుల ఫోన్లను హ్యాకింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ.

ఈ నేపథ్యంలో పెగసిస్‌ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెగసస్ వ్యవహారంపై ఎన్ఎస్ఓ గ్రూప్‌తో లావాదేవీలు జరపలేదని కేంద్ర రక్షణ శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. అయితే తాము కొనుగోలు చేయలేదని క్లారిటీ అయితే ఇచ్చింది. కానీ దాదాపు వెయ్యి మంది భారతీయ పౌరుల మొబైల్‌ ఫోన్లలో పెగసిస్‌ స్పైవేర్‌ ఎటాక్‌ జరిగినట్టు తెలుస్తోంది. కొంత మంది విషయంలో ఫోరెన్సిక్‌ పరీక్షలో కూడా ఆ విషయం నిర్ధారణ అయింది. మరి దీనిని ఎవరు చేయించారో తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఎందుకంటే పెగసిస్‌ ఇదంతా తెలియాలంటే కేంద్రం విచారణ జరిపించాలి. కాని అందుకు కేంద్రం నిరాకరిస్తోంది.

మొత్తం పెగసస్‌ పేరుతో ప్రతిపక్షాలు ఒక్క రోజు కూడా సభా కార్యకలాపాలను సవ్యంగా జరగనివ్వలేదు. ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రజలు కోరుకునే రీతిలో ఏ రోజూ పార్లమెంట్ కార్యక్రమాలు జరగలేదు. సభలను స్తంభింపజేయాలన్న సింగిల్ ఎజెండాతో విపక్షాలు ముందుకు సాగినట్టు కనిపిస్తోంది. రైతు సమస్యలు, పెగసస్‌, పెట్రో ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. పెగాసస్‌పై చర్చ జరిపి, ప్రధాని మోడీ, అమిత్‌ షా సమాధానం ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నాయి. కాని అధికార పక్షం అందుకు ససేమిరా అంటోంది. పార్లమెంటులో ప్రతిష్టంభనకు కేంద్రానిదే బాధ్యత అన్నది విపక్షాల వాదన. వాద ప్రతివాదనలతో విలువైన కాలంతో పాటు 130 కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది.. ఇదీ ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో మనం సాధించింది.