రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని పదే పదే చెబుతున్నామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది అంతర్గత కమిటీల ఏర్పాటు లక్ష్యంగా కమిషన్ పని చేస్తుందని, మహిళా కమిషన్ ఈ రెండున్నర సంవత్సరాల్లో వర్కింగ్ ఉమెన్స్, స్టూడెంట్స్, చిన్నారులపై అత్యాచారాలు పైనా ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా కొన్ని కేసుల్లో మహిళా కమిషన్ జోక్యంతోనే అరెస్టులు జరిగాయన్నారు.
కొన్ని ఘటనల్లో విచారణ ఎలా కొనసాగుతుందనేది కూడా మహిళా కమిషన్ పరిశీలించిందని, బాల్య వివాహాల పైన మహిళా కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె వెల్లడించారు. బాల్య వివాహాలను అడ్డుకోవడానికి కమిషన్ అనేక చర్యలు తీసుకుందని, 72 పైగా ఘటనలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందని ఆమె పేర్కొన్నారు. యూనివర్సిటీల అనుబంధ కాలేజీలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తోందని ఆమె తెలిపారు.