NTV Telugu Site icon

వింత ఆచారం..అక్కడ కాలితో తంతే కష్టాలు ఖతం!

మనదేశంలో విభిన్న మతాలు, ఎన్నో ఆచారాలు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వింత ఆచారం వుంది. అక్కడ కాలితో తంతే కష్టాలు వుండవట. సమస్యలు ఎన్నైనా పరిష్కారం ఒక్కటే. అదే ఒకే ఒక్క కాలి దెబ్బకి కష్టాలు మాయం అవుతాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి వెల్లసిందే….దీపావళి వెళ్ళిన మూడు రోజుల తర్వాత హుల్తిలింగేశ్వర స్వామి పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసం రెండవరోజు పెద్దహుల్తి గ్రామంలో హుల్తిలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. హుల్తిలింగేశ్వర ఉత్సవమూర్తి విగ్రహాన్ని మోసుకు వస్తారు. స్వామిని ఆవహించిన వ్యక్తి చేతిలో ఖడ్గం, విగ్రహం తలపై మోసుకుని గ్రామంలో ఊరేగింపుగా గుడి దగ్గరికి వస్తారు. స్వామి ఊరేగింపుగా అక్కడికి రాగానే అప్పటికే స్వామి భక్తులు తమ కష్టాలను తీర్చుకునేందుకు వరుస క్రమంలో బోర్లా పడుకొని ఉంటారు భక్తులు.

ఉద్యోగం రాని వారు ,సంతానం లేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అప్పులు ఉన్నవారు, ఇలా ఒక్కటి కాదు సమస్యలు ఉన్నవారు బోర్లా పడుకుంటారు. హుల్తిలింగేశ్వర స్వామి అవహించిన వ్యక్తి వారిని కాలుతో తన్ని భక్తుల సమస్యను విని పూలు, బండారు భక్తులకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు స్వామి. కాలితో తన్నిన తరువాత వారి కష్టాలు తీరతాయి. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం, ఇలా అన్ని సమస్యలు చిటికెలో తీరిపోతాయని భక్తుల నమ్మకం.

ఈ వింత ఆచారం చూడడానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ కంప్యూటర్ యూగంలో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు ఆచరించడం విశేషం. అయితే ఇక్కడ కేవలం నిరక్షరాస్యత లేని వాళ్లు మాత్రమే ఈ బోర్లాపడుకుని తన్నించుకుంటున్నారు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఉన్నత చదువులు చదువు కున్న వారు కూడా ఉద్యోగం కోసం ఇలా కాలితో తన్నించుకుంటారు.