Site icon NTV Telugu

ఒమిక్రాన్‌.. థర్డ్‌ వేవ్‌ వస్తుందా..?

కరోనా మహమ్మారి ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ భారత్‌తో పాటు చాలా దేశాలను ఇబ్బందులకు గురిచేసింది.. ఫస్ట్‌ వేవ్‌ను కాస్త లైట్‌ తీసుకోవడంతో సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడింది.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు.. మరణాల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక, థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉందంటూ ఎప్పటి నుంచి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే, ఒమిక్రాన్‌ రూపంలో థర్డ్‌ వేవ్‌ మొదలైందా? అనే చర్చ సాగుతోంది. అయితే ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో ప్రస్తుతానికి మాత్రం ముప్పు లేదని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సిన్‌ వేసుకొని, కోవిడ్‌ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేస్తోంది.. కొత్త వేరియెంట్‌తో ప్రజల్లో వచ్చే సందేహాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది.

Read Also: జవాద్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. 120 రైళ్లు రద్దు..!

ఇదే సమయంలో థర్డ్‌ వేవ్‌పై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేసింది కేంద్రం.. ఒమిక్రాన్‌ కేసులు కొన్ని రెట్ల వేగంతో పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియెంట్‌లో తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదని తెలిపింది.. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉండడం, డెల్టా వైరస్‌ కారణంగా యాంటీ బాడీలు అత్యధికుల్లో వృద్ధి చెందాయని సెరో సర్వేల్లో తేలడంతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయని.. అయితే ఇది శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉందంటున్నారు.. అయితే, కొత్త వేరియంట్‌ బారినపడకుండా కరోనాకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పాటించాలి. మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ వేసుకోకపోతే తప్పనిసరిగా వేయించుకోవాలి.. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానేస్తే బెటర్‌.. గాలి , వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం విస్తృతంగా సాగుతోన్న వ్యాక్సినేషన్‌.. ఒమిక్రాన్‌పై కూడా పనిచేస్తుందా? అనే చర్చ సాగుతుండగా.. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ని అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. వైరస్‌ జన్యువుల్లో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగా టీకా సామర్థ్యం తగ్గే అవకాశాలున్నాయి. అయితే, ఇప్పటికే వ్యాక్సిన్‌లు వేసుకున్న వారు, కరోనా సోకిన వారిలో ఏర్పడిన యాంటీబాడీలతో కణజాలంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఇంకా కొనసాగుతుంది. ఇది, వ్యాధి తీవ్రతని తగ్గించడానికి దోహద పడుతోందని.. ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోనివారు కూడా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Exit mobile version