తిరుమల శ్రీవారి టికెట్లు ఏవైనా క్షణాల్లో అమ్ముడవుతుంటాయి. తాజాగా టీటీడీ సర్వదర్శనం టోకెన్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. జనవరి నెలకు ఆన్ లైన్ లో రెండు లక్షల 60 వేల టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. టోకెన్లు విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు భక్తులు. టోకెన్ల బుకింగ్ పూర్తయిన విషయం తెలియక టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అవుతున్నారు వేలాది మంది భక్తులు. వారికి నిరాశే కలుగుతోంది.
రేపు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది టీటీడీ. మధ్యాహ్నం 3 గంటలకు జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను విడుదల చెయ్యనుంది టీటీడీ. జనవరి 1,13వ తేదీలకు సంబంధించి రోజుకి వెయ్యు చొప్పున టికెట్లు విడుదల చేయనుంది. అలాగే జనవరి 14 నుండి 22వ తేదీకి సంబంధించి రోజుకి 2 వేల టికెట్లు విడుదల చేస్తుంది.
మిగిలిన రోజులలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి 200 చొప్పున ..శని,ఆదివారాలలో రోజుకి 300 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. జనవరి 1 న ,14 నుంచి 22వ తేదీలలో లఘు దర్శనానికి,జనవరి 13న మహాలఘు దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.
