జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మనదేశ క్రీడాకారులు దుమ్మురేపారు. ఏకంగా పదిహేడు పతకాలు సాధించారు. పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులపై.. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
టోక్యో పారా ఒలింపిక్స్.. భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్యాలు కలిపి ఏకంగా మన క్రీడాకారులు.. 17 పతకాలు సాధించారు. ఆగస్టు 24న ప్రారంభమైన ఈ పారా ఒలింపిక్స్ క్రీడలు.. నేటితో ముగియనున్నాయి.
ఈ క్రీడల్లో షూటర్ అవని లేఖర.. రెండు పతకాలు సాధించింది. 19 ఏళ్ల అవని పది మీటర్ల రైఫిల్ స్టాండింగ్ SH1లో బంగారు పతకం, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ SH1లో కాంస్యం సాధించింది. ఒకే ఒలింపిక్స్‌లో భారత్ తరపున రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించింది.రెండు పతకాలు సాధించిన షూటర్ అవని లేఖర ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతకాన్ని చేబూని ముందుకు సాగనుంది.
ప్రమోద్ భగత్ పారా-బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించి రికార్డులకెక్కాడు. సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్3 ఈవెంట్‌లో 33 ఏళ్ల భగత్.. గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ బెథల్‌ను ఓడించి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ బంగారు పతక విజేత అయిన ప్రమోద్ భగత్.. 45 నిమిషాల్లోనే డేనియల్‌పై 21-14, 21-17 వరుస సెట్లతో విజయం సాధించాడు.
ఈ క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 54 మంది అథ్లెట్లు… 9 అంశాల్లో పోటీపడ్డారు.