NTV Telugu Site icon

తెలుగు సినిమా భీష్మాచార్యులు డి.వి.ఎస్.రాజు!

తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం పరితపించిన అరుదైన నిర్మాతల్లో డి.వి.ఎస్. రాజు ఒకరని చెప్పకతప్పదు. రాష్ట్ర, జాతీయ చిత్రపరిశ్రమ అభివృద్ధి సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహించిన రాజు, తాను ఏ హోదాలో పనిచేసినా ప్రతీసారి తెలుగు సినిమా రంగం కోసం తపించారు. అందుకే తెలుగు సినీజనం ఆయనను ‘భీష్మాచార్యులు’ అంటూ అభిమానంగా పిలుచుకొనేవారు.

డి.వి.ఎస్. పూర్తి పేరు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. 1928 డిసెంబర్ 13న తూర్పు గోదావరి జిల్లాలోని అల్లవరంలో ఆయన జన్మించారు. వారి కన్నవారిది స్వతహాగా సంపన్నుల కుటుంబం. కాబట్టి రాజుకు చిన్నతనం నుంచీ తన అభిరుచికి తగ్గ రీతిలో సాగారు. అలా నాటకరంగంవైపు ఆకర్షితులయ్యారు. తరువాత ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ బ్యానర్ పై నాటకాలు వేస్తున్న యన్టీఆర్, పుండరీకాక్షయ్యతో పరిచయం ఏర్పడింది. రామారావు చిత్రసీమలో ప్రవేశించిన తరువాత సొంత నిర్మాణ సంస్థగా ‘యన్.ఏ.టి.’ని నెలకొల్పిన సమయంలో తమ్ముడు త్రివిక్రమ రావును, పుండరీకాక్షయ్యను మద్రాసు పిలిపించారు. వారితో పాటే డి.వి.ఎస్. రాజు సైతం ‘యన్.ఏ.టి’ నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకున్నారు. అలా తొలి నుంచీ యన్టీఆర్ తో అనుబంధం ఉన్న డి.వి.ఎస్.రాజు, రామారావు నిర్మాతగానే పేరు సంపాదించారు.

యన్టీఆర్ నిర్మించిన “పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ” చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు రాజు. తరువాత సోలో ప్రొడ్యూసర్ గా మారి ఏయన్నార్, సావిత్రితో ‘మా బాబు’ చిత్రం నిర్మించారు. ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దాంతో నిరాశ చెందిన రాజును యన్టీఆర్ ఊరడించారు. ఆపై డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై రామారావుతో ‘మంగమ్మ శపథం’ నిర్మించారు రాజు. జమున నాయికగా నటించిన ఈ చిత్రానికి బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

‘మంగమ్మ శపథం’ తరువాత యన్టీఆర్ తో డి.వి.ఎస్.రాజు నిర్మించిన “పిడుగు రాముడు, తిక్క శంకరయ్య, గండికోట రహస్యం” చిత్రాలు వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ విజయాలతో ‘డివిఎస్ ప్రొడక్షన్స్’ సంస్థ జనం మదిలో ఓ స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రాలలో ‘తిక్కశంకరయ్య’కు డి.యోగానంద్ దర్శకుడు కాగా, మిగిలిన చిత్రాలకు విఠలాచార్యనే దర్శకత్వం వహించారు. యన్టీఆర్ తో కె.విశ్వనాథ్ దర్శకునిగా రాజు నిర్మించిన ‘చిన్ననాటి స్నేహితులు’ పరవాలేదనిపించింది. ఆ తరువాత రామారావుతో సి.ఎస్.రావు దర్శకత్వంలో ‘ధనమా?దైవమా?’ నిర్మించగా అది పరాజయం పాలయింది.

శోభన్ బాబుతో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రాజు నిర్మించిన ‘జీవనజ్యోతి’ ఘనవిజయం సాధించింది. కృష్ణతో ‘దేవుడులాంటి మనిషి’ తీశారు. విశ్వనాథ్ దర్శకత్వంలోనే శోభన్ బాబుతో ‘జీవితనౌక’ నిర్మించారు. విశ్వనాథ్ డైరెక్షన్ లో శోభన్ హీరోగా ‘కాలాంతకులు’ అనే యాక్షన్ మూవీనీ తెరకెక్కించారు రాజు. విశ్వనాథ్ దర్శకత్వంలోనే కృష్ణంరాజుతో ‘అల్లుడు పట్టిన భరతం’ నిర్మించారు. ఇవేవీ అంతగా విజయం సాధించలేదు. చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘చాణక్య శపథం’, బాలకృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో ‘భానుమతిగారి మొగుడు’ నిర్మించారు. ఈ సినిమాలు పర్లేదనిపించాయి. నూతన్ ప్రసాద్,కవిత జంటగా రాజు నిర్మించిన ‘ప్రెసిడెంట్ పేరమ్మ’ అలరించింది.

తెలుగులో విజయం సాధించిన ‘న్యాయం కావాలి’ ఆధారంగా హిందీలో ‘ముఝే ఇన్సాఫ్ ఛాహియే’ నిర్మించారు డి.వి.ఎస్.రాజు. ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకులు. 1988లో డి.వి.ఎస్.రాజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. 2001లో ఆయనకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అందించింది. 2010 నవంబర్ 13న ఆయన తుదిశ్వాస విడిచారు. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పై డి.వి.ఎస్.రాజు నిర్మించిన చిత్రాలు ఈ నాటికీ బుల్లితెరపై అభిమానులను అలరిస్తూనే ఉండడం విశేషం!