Site icon NTV Telugu

నేడు మాజీ సీఎం రోశయ్య అంత్య క్రియలు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. ముందుగా గాంధీభవన్‌కు.. తీసుకెళ్లి అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోనున్నాయి. అక్కడి నుంచి కొంపల్లిలోని ఫాంహౌజ్‌కు అంతిమయాత్ర సాగనుంది. తెలుగు రాజకీయాల్లో కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య ఇకలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, దాదాపు అందరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల కేబినెట్‌లోనూ మంత్రిగా సేవలందించి.. రికార్డు సృష్టించారు రోశయ్య. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి ఏడుసార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాఠిగా పేరుపొందారు.


రోశయ్య 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1968లో తొలిసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980ల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులందరి దగ్గర కీలకమైన శాఖలు నిర్వర్తించారు. 2004లో అసెంబ్లీకి చీరాల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగాక 2010 నవంబరు 24న తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు.
రోశయ్య మృతితో మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. రోశయ్య పార్ధీవదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.


రోశయ్యకు హైదరాబాద్‌లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తీర్మానించింది. ఆ తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌కు పంపుతామన్నారు కాంగ్రెస్‌ నేతలు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రోశయ్య రికార్డు సృష్టించారని కొనియాడారు. కొన్నిసార్లు తాము ఇద్దరం కలిసి పనిచేశామని.. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా నిజాయితీగా ప్రజలకోసం పనిచేశారని అన్నారు. ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలిస్తారు. అక్కడ కాంగ్రెస్‌ నేతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొంపల్లిలోని సొంత ఫాం హౌస్‌లోనే అంత్యక్రియలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులు బొత్స, బాలినేని, వెల్లంపల్లి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

Exit mobile version