భారీవర్షాలు, వరదలతో తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్‌గా మారింది. చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరదనీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం వుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటేశ్వరపురం, నెన్నూరులో అప్రమత్తత ప్రకటించారు. వీటితోపాటు గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరులో అలర్ట్ ప్రకటించారు. అలాగే, వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరు వంటి పల్లెలు ఖాళీ చేయాలని హెచ్చరించారు. పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు.
రాయలచెరువుకు గండి పడితే భారీ ప్రమాదం సంభవించే అవకాశం వుంది. గండిని పూడ్చే అవకాశం లేదంటున్నారు అధికారులు. చెరువు చుట్టూ వందలాది గ్రామాలు వున్నాయి.బలిజపల్లి, మిట్టురు, కమ్మకండ్రిక ,సి రామాపురం,రామచంద్రాపురంవంటి దిగువ గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. గండి పడితే తిరుచానురు స్వర్ణముఖి వరకు నీటి ప్రవాహం వుండే అవకాశం వుంది. దీంతో రాయలచెరువు ప్రాంతానికి చేరుకుంటున్నారు పోలీసులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు సేవలందించేలా సిద్దం చేస్తున్నారు అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు. అవసరమైతే హెలికాప్టర్లు రంగంలోకి దింపే యోచనలో వున్నారు అధికారులు, నిన్నటి నుంచి రాయలచెరువుకు ప్రమాదం పొంచి వుందంటూ ప్రజల్ని హెచ్చరిస్తూనే వుంది ఎన్టీవీ.
రాయలచెరువు సమీప గ్రామాలు ఇవే!
సంజీవరాయపురం, బలిజపల్లి, పివి పురం, గంగమాంబపురం, రామిరెడ్డి పురం, గంగిరెడ్డి పల్లి, పద్మావళ్ళిపురం, కమ్మ కండ్రిగ, నడవలూరు, నెన్నూరు, కట్ట కింద వెంకటాపురం, నాగూర్ కాలనీ, కుంట్రపాకం, వెంకటరామాపురం, కమ్మపల్లి,గణేశ్వర పురం, సొరకాయల పాల్యం, వేమూరు, కాయం పేట, వడమాలపేట, తిరుచానూరు వంటి గ్రామాలు వున్నాయి. దాదాపు యాబైవేల మంది జనాభా ఇక్కడ నివశిస్తున్నారు. పరిస్థితి ఎలా మారినా అప్రమత్తంగా వున్నామని అధికారులు తెలిపారు.