NTV Telugu Site icon

రివ్యూ: తలైవి (తమిళ డబ్బింగ్)

Thalaivi

పురచ్చి తలైవి జయలలితను అమ్మగా ఆరాధించే తమిళులు అధికం. భారతదేశ సినీ, రాజకీయ చరిత్రలో నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలితది ఓ ప్రత్యేక అధ్యాయం. ఆమె మరణానంతరం బయోపిక్స్ రూపొందించాలని చాలా మంది ప్రయత్నించారు. అందులో రమ్యకృష్ణ నాయికగా ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ సీజన్ 1 వచ్చింది. నిత్యామీనన్ సైతం జయలలిత బయోపిక్ లో నటించబోతోంది. ఇదిలా ఉంటే… కంగనా రౌనత్ నాయికగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో విష్ణు వర్థన్, శైలేష్ సింగ్ నిర్మించిన ‘తలైవి’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

జయలలిత జీవితం తెరచిన పుస్తకం. జయను స్టార్ ను చేయాలని ఆమె తల్లి ఎలా తపించిందో, సినిమాల్లోకి రావడం ఇష్టం లేని జయలలిత కెరీర్ ప్రారంభంలో ఎంత ఆటిట్యూడ్ ను ప్రదర్శించిందో కోలీవుడ్ లో అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఒకసారి ఎంజీఆర్ దృష్టి ఆమెపై పడిన తర్వాత, ఆయన సాంగత్యంలో జయలలిత ఎంతో మారిందని చెబుతారు. అయినా… ఆమెలోని స్వతంత్ర భావాలు ఎంజీఆర్ ను సైతం ప్రశ్నించేలా చేసేవని, కొన్ని సందర్భాలలో ఆయన కూడా ఆ తెగింపును ఇష్టపడేవారని అంటారు. సినీ వైకుంఠపాళిలో ఎత్తులూ, పల్లాలు రెండూ చూసిన జయలలిత, రాజకీయ రంగ ప్రవేశం చిత్రంగానే సాగింది. అక్కడ ఆమె ఎక్కిన నిచ్చెనల కంటే… పాము కాటుకు గురైన సందర్భాలే ఎక్కువే. అయితే కిందకు త్రోసివేయబడిన ప్రతిసారీ ఆమె అంతే వేగంగా, కసితో తిరిగి నిచ్చెన ఎక్కే ప్రయత్నం చేసింది. ఎప్పుడూ… పోరాట స్ఫూర్తిని కోల్పోలేదు. ఎంజీఆర్ ఉన్నప్పుడూ సైతం పొలిటికల్ గా వెన్నుపోటుకు గురైన జయలలిత, ఆయన మరణానంతరం తనకంటూ ఓ కట్టుదిట్టమైన కోటను నిర్మించుకుంది. అన్నాడీఎంకే పార్టీ గెలుపోటములకు తానే ఏకైక కారణంగా నిలిచింది. అలా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా తమిళ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకుంది.

ఓ ఒంటరి మహిళ జీవితంలోని ఈ సాహసోపేతమైన ఘట్టాలను తెరకెక్కించడానికి ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు! అదే పని చాలామంది చేయాలని ప్రయత్నించారు. కొందరు అందులో సఫలీకృతులయ్యారు. తాజాగా ఆ వంతు ఎ. ఎల్. విజయ్ కు దక్కంది. అయితే… తెరచిన పుస్తకాన్ని తలపించే జయ జీవితాన్ని తెర మీద చూపించడం కత్తిమీద సాములాంటి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. జయలలిత యాటిట్యూడ్ ను, ఆమెలోని కన్నింగ్ నెస్ ను యథాతథంగా తెర మీద చూపిస్తే, అభిమానులు సైతం ఆగ్రహించే ఆస్కారం ఉంటుంది. ఇక జయలలితలోని అమ్మతనాన్ని, పేదల పట్ల ఆమె చూపించిన అభిమానాన్ని గ్లోరిఫై చేస్తే అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ పెద్దలకు కంటగింపుగా మారే ఆస్కారం ఉంటుంది. ఇక జయలలితను ఎంజీఆర్ ఎలా రాజకీయ పావుగా వాడుకున్నారు, ఒకానొక సమయంలో ఆమెను పార్టీ నేతల సూచనల మేరకు ఎలా దూరం పెట్టారు అనేది చూపిస్తే… ఆయన అభిమానులను దూరం చేసుకున్నట్టు అవుతుంది. సో… జయ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెర మీద చూపించడం ఎవరికైనా అతి పెద్ద సమస్య. అయితే… కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్నచందంగా ఎ.ఎల్. విజయ్ ‘తలైవి’ చిత్రాన్ని రూపొందించారు.

1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జయలలితకు జరిగిన అవమానంతో మొదలైన ఈ సినిమా… ఫ్లాఫ్ బ్యాక్ లో సాగి… చివరకు 1991 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో జయలలిత గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. ప్రథమార్థంలో ఎక్కువగా జయలలిత, ఎంజీఆర్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారానికి ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు విజయ్, ద్వితీయార్థంలోనే జయలలిత అంటే ఏమిటో చూపించే ప్రయత్నం చేశాడు. దాంతో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంజీఆర్ బయోపిక్ ను తలపించింది. జయలలిత బాల్యం, యవ్వనం, సినీ రంగ ప్రవేశం, అక్కడ ఎదుర్కొన్న ఆటుపోటులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. కారణం ఏదైనా వాటిపై దర్శకుడు దృష్టి పెట్టలేదు. జయలలితకు, తల్లికి మధ్య ఉన్న అనుబంధం, ఎంజీఆర్ జీవితంలో ఆమెకు ఉన్న ప్రాధాన్యం వీటి చుట్టూనే ప్రథమార్థం సాగింది. సినిమా రంగంలో ఉండే రాజకీయాలను కొంతలో కొంత చూపించే ప్రయత్నం చేశారు. ఇక రాజ్యసభ సభ్యురాలిగా జయలలిత ఢిల్లీలో అడుగుపెట్టిన దగ్గర నుండి తమిళనాడు రాజకీయాలపై ఆమె ఎలా పట్టు సాధించిందో చూపించారు. కానీ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడంతో సినిమాను ముగించడంతో ఇది హాఫ్ కుక్డ్ డిష్ గా మారిపోయింది. ఆ మధ్య వచ్చిన వెబ్ సీరిస్ అంటే… సీజన్ 2 ఉంటుంది కాబట్టి ఓకే అని జనం భావించారు. కానీ ఇది సినిమా… దీనిని ఇలా అర్థాంతరంగా ముగించడం అనేది చాలామందికి నచ్చని అంశం. పోనీ జయలలిత రాజకీయ జీవితాన్ని మరో సినిమాగా మలుస్తామన దర్శక నిర్మాతలు ప్రకటించి ఉంటే అది వేరే విషయం. ఎన్టీయార్ బయోపిక్ తరహాలో మరొకటి వస్తుందని తమకు తాము సర్థిచెప్పుకుని ఉండేవారు. కానీ అలానూ జరగలేదు.

ఇది జయలలిత బయోపిక్ అనే కంటే ఎంజీఆర్ పార్షియల్ బయోపిక్ అనడం కరెక్ట్. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల నటన కూడా ఉంది. ఎంజీఆర్ పాత్రలోకి అరవింద స్వామి పరకాయ ప్రవేశం చేశాడు. తెర మీద చూస్తోంది ఎంజీఆర్ నేనా అనేలా నటించాడు. ఎంజీఆర్ హావభావాలను, బాడీ లాంగ్వేజ్ ను అరవింద స్వామి ఎంత బాగా స్టడీ చేశాడో అతని నటనను చూస్తే అర్థమైపోతుంది. ఇక జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్… జయలలిత పాత్రను పోషించింది తప్పితే ఆమెలా కనిపించాలని అనుకున్నట్టు లేదు. జయగా కంగనా రనౌత్ నటించింది అంతే! దాంతో మనం తెర మీద ఓ నటిని చూస్తాం తప్పితే… ఆమెలో జయలలితను ఊహించుకోలేం. అయితే… ఆ పాత్రను కంగనా రనౌత్ ప్రాణం పెట్టింది. తాను చేయగలిగినంత చేసింది. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే శాస్త్రీయ నృత్యం ఆకట్టుకుంది. ఇక ఎంజీఆర్ సన్నిహితుడి పాత్రను సముతిరఖని అద్బుతంగా పోషించాడు. కరుణానిధిగా నాజర్, జయలలిత తల్లిగా భాగ్యశ్రీ,, జానకీ రామచంద్రన్ గా మధుబాల నటించారు.

తమిళుల సంగతి ఎలా ఉన్నా తెలుగు సినిమా ప్రేక్షకులు జయలలిత బయోపిక్ లో శోభన్ బాబు ను విస్మరించడానికి అంగీకరించలేరు. మరి దర్శకుడు ఎందుకు ఆ పాత్రను తెర మీద చూపించలేదో తెలియదు. జయలలిత బయోపిక్ చూసిన తర్వాత వద్దనుకున్నా… సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ప్రేక్షకులకు గుర్తొస్తుంది. దాంతో సహజంగానే కంపారిజన్ మొదలవుతుంది. ఓ నటి జీవితాన్నే దర్శకుడు నాగ అశ్విన్ అంత చక్కగా తీసినప్పుడు, నటి, రాజకీయ నేత జయలలిత బయోపిక్ ను సీనియర్ డైరెక్టర్ విజయ్ ఇంత పేలవంగా తీశాడేమిటీ అనిపిస్తుంది. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ చిత్రంలో సంభాషణలు బాగున్నాయి. జయలలితకు అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణంతో పోల్చుతూ, మహాభారతంకు మరో పేరుంది అదే జయమ్ అని చెప్పించడం బాగుంది. జి.వి. ప్రకాశ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా!

మొత్తం మీద నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం కోసం జయలలిత బయోపిక్ ‘తలైవి’ని చూడొచ్చు. కానీ ఓ గొప్ప యోధురాలి గాథను చూడబోతున్నామనే భావనతో థియేటర్ కు వెళితే మాత్రం నిరాశకు గురికాక తప్పదు.

రేటింగ్ : 2.5 / 5

ప్లస్ పాయింట్స్
జయలలిత బయోపిక్ కావడం
నటీనటుల నటన
సాంకేతిక నిపుణుల పనితనం

మైనెస్ పాయింట్
ఉద్వేగం కలిగించని సన్నివేశాలు
ఆసక్తి రేకెత్తించని స్క్రీన్ ప్లే

ట్యాగ్ లైన్: కర్ర విరగలేదు! పాము చావలేదు!!