ఒక్క ఉపఎన్నిక లోకల్ లీడర్స్‌కు పండగ తీసుకొచ్చింది. రోజుల వ్యవధిలోనే లక్షలకు.. కోట్లకు పడగలెత్తుతున్నారు. నోటి వెంట లక్షలు.. కోట్లు తప్ప మరో ముచ్చట లేదు. జంపింగ్ జపాంగ్‌లకైతే జాక్‌పాట్. వేగంగా చేతులు మారుతున్న నోట్ల కట్టల కథేంటో ఈ స్టోరీలో చూద్దాం.
రాత్రికి రాత్రే లక్షాధికారులు.. కోటీశ్వరులు అవుతున్నారా?
తెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతుంటే.. అక్కడి లోకల్ లీడర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. బైఎలక్షన్ పుణ్యమా అని స్థానికంగా ఉన్న చోటామోటా నాయకులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధానపార్టీలు నోట్లకట్టలతో గాలం వేస్తున్నాయి. వెనక వందఓట్లు ఉంటే చాలు.. లోకల్ లీడర్స్ పంట పండినట్టే. ఎంత రేటైనా కట్టి కండువా కప్పేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. దీంతో రాత్రికి రాత్రే లక్షాధికారులు.. కోటీశ్వరులు అయిన వారు ఎంతోమంది హుజురాబాద్ నియోజకవర్గంలో ఎదురుపడుతున్నారు.
లోకల్ లీడర్స్ ఏది కోరుకుంటే అది అందుతోందా?
ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక చాలా కాస్ట్‌లీగా మారింది. పోటీ రసవత్తరంగా.. ప్రతిష్టాత్మకంగా మారే కొద్దీ డబ్బు వరదలా పారుతోంది. 2 నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీలు చేసిన ఖర్చు అధికారికంగా ప్రకటిస్తే కళ్లు బైర్లుగమ్ముతాయి. నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులకు.. వివిధ కుల, ప్రజాసంఘాల ప్రతినిధులకు ఎక్కడలేని డిమాండ్ నెలకొంది. ఇక వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు.. మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లకు ఏది కోరుకుంటే అది క్షణాల్లో అందిపోతోందట. ఖరీదైన గిఫ్ట్‌లు కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి.
ఆఫర్లు వెల్లువెత్తి లోకల్ లీడర్స్ ఉక్కిరిబిక్కిరి!
నిన్న మొన్నటి వరకు అప్పుల బాధలతో ఇబ్బంది పడ్డవారు.. రుణ విముక్తులై.. ఇస్త్రీ చొక్కా నలగకుండా తిరుగుతున్నారట. డొక్కు బైకుల ప్లేస్‌లో ఖరీదైన బైకులు.. పోష్ కార్లు రెయ్‌మని దూసుకెళ్తున్నాయి. ప్రధాన పార్టీలలో ప్రైవేట్‌గా జరుగుతున్న సంభాషణల ప్రకారం.. గ్రామాల్లో వార్డు మెంబర్‌కు లక్షకుపైగానే ఇస్తున్నారట. సర్పంచ్‌కు 3 నుంచి 5 లక్షలు, జిల్లాస్థాయి నాయకులైతే 10 లక్షలు.. కుల సంఘంలో పెద్ద నాయకుడైతే పది లక్షలు రేటు కడుతున్నారట. రెండు పార్టీల నుంచి పోటాపోటీగా ఆఫర్లు వెల్లువెత్తి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట లోకల్ లీడర్స్.
నమ్మకం కుదిరితే ఎంతైనా ఇచ్చేందుకు రెడీ!
టీఆర్‌ఎస్‌లో ఉంటూనే బీజేపీకి పనిచేసేవారికి.. బీజేపీలో ఉంటూ టీఆర్ఎస్‌కు జై కొట్టే స్లీపర్ సెల్స్ లాంటి నేతలకైతే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉందట. వాళ్లు అడిగింది కాదనకుండా లక్షల్లో ఇస్తున్నారట. ఇలాంటి స్లీపర్ సెల్స్ గురించి నమ్మకం కుదిరితే ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడటం లేదట ప్రధాన పార్టీలు. అదే ఇప్పుడు హుజురాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక వాణిజ్య సంఘాలకు సైతం వరాల జల్లు కురుస్తోంది. ఓట్లు వేయిస్తామని హామీ ఇస్తే.. సంఘాలలోని కొందరు ప్రతినిధులకు కార్లు బంపర్ ఆఫర్‌గా ఇంటి ముందు వాలిపోతున్నాయట. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇంకా సంతోష పరుస్తామని హామీలు ఇస్తున్నారట టీఆర్ఎస్, బీజేపీ నేతలు.
అన్ని బుకింగ్‌లూ హుజురాబాద్‌కే..!
వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, సిద్ధిపేటల్లోని వివిధ కార్ల షోరూమ్‌లలో ఇప్పటికే నాయకుల పేర్ల మీద కార్ల కొనుగోలుకు అడ్వాన్స్‌లు కూడా కట్టారట. అన్ని బుకింగ్‌లూ హుజురాబాద్‌కే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒకేఒక్క ఉపఎన్నిక నియోజకవర్గంలోని చోటా మోటా నాయకులకు, వివిధ సంఘాల ప్రతినిధులకు భారీగా గిట్టుబాటు అవుతోంది. మరి.. పోలింగ్ ముగిసే నాటికి ఎంత మంది జాతకాల్లో ఆదాయం పెరుగుతుందో చూడాలి.
