NTV Telugu Site icon

‘ధరణి’కి ఏడాది.. సమస్యలు ఏమీ లేవా..?

రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకొచ్చారు.. మధ్యవర్తుల అవసరం లేకుండా.. లంచాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.. ధరణి అందుబాటులోకి వచ్చేముందే కాదు.. ఆ తర్వాత కూడా ఎన్నో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది.. తెలంగాణలో ధరణి శకం మొదలై ఏడాది పూర్తయింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్‌ 29న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా.. దేశంలో మరెక్కడా కూడా లేనంతగా పారదర్శకంగా ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ జరిగే విధానం అమలవుతోంది.. గతంలో.. రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం.. మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ, వీఆర్వో చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ధరణి పోర్టల్‌కు చెక్‌ పెట్టేసింది.. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అక్కడి జరిగిపోగా.. వారం పది రోజుల్లో నేరుగా ఇంటికే పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తోంది సర్కార్.. ఇక, ఏడాదిగా విజయవంతంగా సాగుతోన్న ధరణి ప్రయాణంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సేవలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు అధికారులను, జిల్లాల కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి… ధరణి అందిస్తున్న పారదర్శకమైన, అవాంతరాలు లేని సేవలతో పౌరులు, ముఖ్యంగా రైతులు ఎంతో ప్రయోజనం పొందారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

గతంలో రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలకు చెక్‌ పెడుతూ.. అత్యాధునిక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ధరణిని తీసుకొచ్చింది ప్రభుత్వం… రికార్డుల్లో మార్పులు చేర్పుల్లో అధికారుల విచక్షణాధికారాలకు తావులేకుండా, ట్యాంపర్‌ చేసే వీలు లేకుండా రూపొందించారు. భూ లావాదేవీలకు ధరణి గమ్య స్థానంగా నిలిచింది. పోర్టల్‌ ప్రారంభంతో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రజలకు అత్యంత చేరువయ్యాయి. గతంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత తాసిల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా ఇచ్చింది ప్రభుత్వం.. దీంతో.. ప్రస్తుతం 574 తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయలు యథావిథిగా పనిచేస్తున్నా.. వ్యవసాయేతర లావాదేవీలు అందులో నిర్వహిస్తున్నారు. ఇక, మొదటి ఏడాదిలోనే అద్భుత ప్రగతి సాధించింది ధరణి.. ఈ ఏడాది కాలంలో 10 లక్షల లావాదేవీలు పూర్తి చేసుకుని సత్తాచాటింది.. గతంలో పాస్‌ పుస్తకాలు ఇవ్వని దాదాపు 1.80 లక్షల ఎకరాల భూమిని ఈ ఏడాది కాలంలో ధరణి పరిధిలోకి తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నారు.. క్రమంగా వస్తున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకొనే సామర్థ్యం ధరణి ప్రత్యేకత అని అధికారులు చెబుతున్న మాట.. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మా డ్యూల్స్‌, 10 సమాచార మాడ్యూ ల్స్‌ ఉన్నాయి. ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకే పరిమితం కాకుండా భూ సమస్యలను తీర్చే విధంగా మార్పులు చేస్తూ వస్తున్నారు.. పెండింగ్‌ మ్యుటేషన్లతోపాటు ఇతర భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక మాడ్యూల్స్‌ ప్రవేశపెట్టారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు పరిశీలించి పరిష్కరిస్తున్నారు. పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 5.17 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్టు అధికారులు వెల్లడించారు..

ముఖ్యంగా రైతుల భూములు భద్రంగా ఉండాలి.. ఎవ్వరు పడితే వారు మార్చే అవకాశం లేకుండా చేయడమే దీని లక్ష్యమని.. మరోవైపు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అన్ని రకాల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించాలి.. భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఏకకాలంలో జరిగే విధంగా ఉండేందుకే ఈ వ్యవస్థ అని గతంలో ఎన్నోసార్లు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.. వాటికి అనుగుణంగా ఎన్నో మార్పులకు కేంద్ర బిందువుగా మారింది ధరణి.. ఇదే సమయంలో.. భూ రికార్డుల ప్రక్షాళన చేసింది సర్కార్.. 140కిపైగా ఉన్న రెవెన్యూ చట్టాలను ఏకం చేయడంతోపాటు రైతులను వెంటాడుతున్న 76 రకాల భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు 2020 సెప్టెంబర్‌ 10న నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇక, ధరణి పోర్టల్‌ ప్రారంభం వెనుక మూడేండ్ల మథనం ఉన్నదని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో వెల్లడించారు..

2020 అక్టోబర్‌ 29న మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్‌ సీఎం కేసీఆర్‌ ప్రారంభించగా.. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రాలేకపోయినా.. కొన్ని సాంకేతిక సమస్యల పరిష్కారం తర్వాత లావాదేవీలను ప్రారంభించారు.. ఈ విధానంతో.. రుణాల కోసం ఈసీ, పాస్‌బుక్‌ల తనఖా పెట్టడానికి చెక్‌ పెట్టామని చెబుతున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం.. ఇది పూర్తిగా అమల్లోకి రాలేదంటున్నారు రైతులు.. ఇప్పటికీ బ్యాంకుల్లో పాస్‌బుక్‌లు అడుగుతున్నారని చెబుతున్నారు.. ఒకే రోజులో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి చేస్తున్నారు.. ప్రభుత్వ భూములన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి… రెవెన్యూ కోర్టుల్లోని ఫిర్యాదుల పరిష్కార బాధ్యత ట్రిబ్యునళ్లకు ఇచ్చింది.. ఈ ఏడాది కాలంలో.. 10,45,878 స్లాట్లు బుక్‌ చేయగా.. 10,00,973 లావాదేవీలు పూర్తి అయ్యాయి.. అందులో భూ విక్రయాలకు సంబంధించినవి 5,02,281 అయితే, గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్లు 1,58,215, ఫౌతి 72,085, తనఖా 58,285గా ఉంది. ఇక, ధరణి పోర్టల్‌ వీక్షకుల సంఖ్య 5.17 కోట్లకు చేరినట్టు అధికారులు వెల్లడించారు..

మరోవైపు.. కొన్ని సమస్యలు కూడా ధరణిని వెంటాడుతున్నాయి.. ధరణి ఇంకా పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్‌ కావాల్సి ఉందంటున్నారు.. ధరణి అమల్లోకి వచ్చినా భూమికి హక్కు పత్రాలు లేక దాదాపు 4 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. భూ సమస్యలను పరిష్కరించే అధికారం గతంలో తాహసీల్దార్ల వద్ద ఉండగా.. దానిని కలెక్టర్లకు అప్పగించింది కొత్త రెవెన్యూ చట్టం.. దీంతో.. బాగా జాప్యం జరుగుతుందంటున్నారు.. ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్‌లు పెట్టినా.. చిన్న చిన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. దరఖాస్తులు పెట్టుకున్నా.. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే తిరస్కరిస్తున్నారే విమర్శలు కూడా ఉన్నాయి.. పట్టాదారుల వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి.. కానీ, అసైన్డ్, ఇనాం, శివాయి జమేదారీ, లావుణి పట్టాలు కనిపించడంలేదని.. అదే విధంగా మాజీ సైనికుల భూముల్లో సగానికి పైగా ఆన్‌లైన్‌లో లేవని మొత్తుకునేవారు కూడా ఉన్నారు.. ఇక, దరఖాస్తుల పరిష్కారం గురించి తెలుసుకునే వ్యవస్థ లేకపోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు.. చిన్న చిన్న సమస్యలతో.. కొన్ని మార్పిడీ కి, రిజిస్ట్రేషన్ కు నోచుకోవడంలేదనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేసినా.. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కావడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.