NTV Telugu Site icon

4 నియోజకవర్గాల్లో దళిత బంధు.. 13న సీఎం కేసీఆర్‌ సమీక్ష..

దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పటికే తాను దత్తత తీసుకున్న వాసాలమర్రిలో అమలు చేశారు.. ఆ తర్వాత పైలట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు.. ఇక, మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. అంటే.. నాలుగో నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రగతిభవన్‌లో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు..

మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, అచ్చంపేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజక వర్గంలోని నిజాంసాగర్ మండలం ఇలా నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ తో పాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవలే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.. ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ‘ దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు.. సోమవారం జరగనున్న ఈ సన్నాహక సమావేశంలో… ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్.. నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు., జిల్లాపరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు,. మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజవర్గాల శాసన సభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి, సిఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫెనాన్స్ సెక్రటరీ పాల్గొంటారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పొల్గొంటారని తెలిపారు సీఎం కేసీఆర్.