NTV Telugu Site icon

కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఇతర కులాలకూ రూ.10 లక్షలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పటికే దళితుల ఆర్థిక అవసరాల లక్ష్యంతో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేసిన ఆయన.. ఆర్థిక సామాజిక వివక్ష ను బద్దలు కొట్టాలనే ఆశయం తో దళిత బంధు పథకo అని సీఎం పునరుద్ఘాటించారు. హుజూరాబాద్, వాసాలమర్రితో సహా మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నామని.. నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, కేవలం దళితులే కాదు.. ఇతర కులాల్లోని పేదలకు కూడా రూ. 10 లక్షల సహాయం అందించాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్.. వరుస క్రమంలో అందరికీ దళిత బంధు లాంటి పథకం తీసుకొస్తామన్నారు.

అయితే, దళితబంధు పథకం అమలు విషయంలో మిగతా వర్గాలు సహకరించాలని కోరారు సీఎం కేసీఆర్.. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళితబంధు పథకం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న ఆయన.. సంవత్సరానికి రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు.. పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పోతామని స్పష్టం చేసిన సీఎం.. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు.. రైతు బంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదన్న ఆయన.. కాకపోతే తమకు కూడా మేలు చేయాలని మాత్రమే దళితజాతి ప్రజలు కోరుకున్నారని తెలిపారు. ఇప్పుడు దళితబంధు పథకం అమలు విషయంలో కూడా మిగతా వర్గాలు అదే స్థాయిలో సహకరించాలి కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.