తెలంగాణ పేరు వినిపిస్తేనే నిర్బంధం నుంచి గొంతు పిక్కటిళ్లేలా జై తెలంగాణ నినాదం ఎత్తుకున్న వరకు ఉద్యమనేతగా… తెలంగాణ సాధకుడిగా అశేష ఖ్యాతి సాధించిన కేసీఆర్.. మరో ఘనత సాధించారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమంతో తెలంగాణ సాధించి.. స్వరాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్ మరో సారి అరుదైన ఘనతను సాధించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో.. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దేశంలో.. అత్యధికాలం పాటు ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగిన నేతల జాబితాలో చేరారు కేసీఆర్. హైదరాబాద్ హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో… కేసీఆర్‌ను మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు నేతలు. కేసీఆర్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు.. సమావేశంలో అధికారికంగా ప్రకటించారు సీనియర్‌నేత కేకే. దీంతో 9 వ సారి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికయ్యారు.
మరోసారి పార్టీశ్రేణులు తనపై నమ్మకం ఉంచినందుకు.. ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్. వారి విశ్వాసాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వమ్ము చేయబోనని స్పష్టం చేశారు. కాగా, 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ అధ్యక్షతన 12 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన పలు ప్లీనరీల్లో కేసీఆరే అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా… ఉపసభాపతి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉద్యమాన్ని మొదలెట్టారు కేసీఆర్. అలా మొదలైన కేసీఆర్ ప్రస్తానం.. దినదిన ప్రవర్థమానంగా విలసిల్లుతోంది. 2002 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ప్రథమ వార్షికోత్సవానికి నల్లగొండ వేదికగా నిలిచింది. రెండ్రోజుల ప్లీనరీ నిర్వహించారు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు తప్ప… ప్రతీ ఏటా ప్లీనరీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఒక్కోయేడు ఒక్కోచోట ఈ ప్లీనరీ నిర్వహించడం విశేషం. అదే విధంగా, రెండేళ్ల కోసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నారు.
అయితే, ప్రతీసారి పార్టీశ్రేణులు తమనేతగా కేసీఆర్‌నే ఎన్నుకున్నాయి. కేసీఆర్ వెంటే నడిచాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. కేసీఆర్‌కు పార్టీపై పట్టు సడలలేదు. ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తూనే… పార్టీని కూడా అదేస్థాయిలో పటిష్టంగా మలచడంలో సక్సెస్సయ్యారు కేసీఆర్. అందుకే, పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో.. ప్రతీసారి కేసీఆర్ పేరిటే నామినేషన్లు దాఖలయ్యాయి. అలా, పార్టీపై తనదైన ముద్రవేశారు కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్.. అన్నంతగా ప్రసిద్ధికెక్కిన గులాబీ దళపతి… పార్టీపరంగానూ అంతే ప్రతిష్టపొందారు. అందుకే, 20ఏళ్ల గులాబీ పార్టీకి… ఆయనే బాస్‌గా ఉన్నారు. తొమ్మిదోసారి కూడా.. ఆయనే దళపతి ఎన్నికై చరిత్ర సృష్టించారు. దేశంలో అత్యధికకాలం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన నేతల జాబితాలో చేరారు.