ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళితబంధు పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రైతు బంధు తరహాలో దళిత బంధు కూడా అందరికీ వర్తింస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉన్నవారికి రైతు బంధు వచ్చినట్టే.. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుందని వెల్లడించారు.. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.. ఆ రైతు బంధు కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తుందని.. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందన్నారు.
కరీంనగర్ లో జరిగిన సభలో రైతుబీమా ప్రకటించాను. ఆ స్కీం అద్భుతంగా కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్… తెలంగాణ చరిత్రలో మహోత్తరమైన, కొత్త చరిత్రను సృష్టించే, తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ జిల్లా తెలంగాణ సాధనలో తొలిసింహ గర్జన నుంచి నేటి వరకు కూడా సెంటిమెంట్‌గా బ్రహ్మాండమైన పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూరే వేదికగా ఈ జిల్లా మారింది. ఈ క్రమంలోనే ఈ జిల్లా నుంచే అద్భుతమైన ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాను. మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్‌కు పుష్పాంజలి ఘటించి శ్రీకారం చుడుతున్నాం అన్నారు సీఎం కేసీఆర్. దళితబంధు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. కాకూడదు కూడా. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందన్నారు.
తెలంగాణలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని వెల్లడించారు సీఎం కేసీఆర్.. దశలవారీగా అందరికీ ఈ పథకం వర్తింపజేస్తాం అన్నారు.. ఎస్సీల్లో పేదలకు ముందుగా దళితబంధు వస్తుందన్నారు.. దళితబంధుకు కిస్తీలతో కిరికిరి లేదు.. ఆ సొమ్ముతో నచ్చిన వ్యాపారం, మెచ్చిన పని చేసుకోవచ్చు అన్నారు.. ఇక, దళితబంధు వస్తుందని.. ప్రభుత్వ పథకాలు అన్న కట్ అవుతాయనే భయం వద్దు.. పెన్షన్ కట్టు కాదు.. రేషన్ బియ్యం.. ఇలా అన్ని పథకాలు వర్తిస్తాయని తెలిపారు.. ఏ ప్రాంతం వ్యక్తులు.. అక్కడే పెట్టుబడి పెట్టాలని లేదు.. మీకు నచ్చిన ప్రాంతంలో వ్యాపారం చేసుకొవచ్చు అన్నారు. సీఎస్ కూడా హామీ ఇచ్చిండు.. నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాం అని మాటిచ్చాడని తెలిపారు.. ఇక, హుజూరాబాద్ లో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నాయి.. పెరిగితే ఇంకో వెయ్యి పెరగొచ్చు.. సీఎం ఇయ్యాలని అనుకున్నాక ఏదైనా ఆగుతుందా.. రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలకు కొదవ ఉంటదా? అని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి వచ్చే నెల.. రెండు నెలల్లో దళితబంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున ఇస్తామన్నారు.. దళిత బందు కు హుజూరాబాద్ ప్రయోగశాల అన్న సీఎం.. ఏ స్కీమ్ పెడతారో పెట్టుకోండి.. దాంట్లో దళితులకు రిజర్వేషన్ ఇస్తాం అన్నారు.. ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ ఇస్తాం.. ప్రభుత్వ పనుల్లో దళితులకు ఇన్ని ఇవ్వాలని రిజర్వేషన్ ఇస్తాం అన్నారు. దీని వెనకాల ఏముందో తెలుసు.. ఏమవుతుందో తెలుసు.. అన్ని చెప్తా.. కానీ, ఒకేసారి అన్ని చెప్తే కొందరికి హార్ట్ ఫెయిల్ అయిపోయి సచ్చిపోతరు అని చెప్పట్లేదు అంటూ ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తే లక్ష 75 వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు.. నాలుగైదు ఏళ్లలో అందరికీ ఈ పథకం నిధులు అందుతాయని.. ఏడాది కి 30… 35 వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందన్నారు.