Site icon NTV Telugu

టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతం జరగాల్సిందే

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగా దుబాయ్ చేరుకుని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పిచ్‌లపై అవగాహన ఉన్న టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఆడుతున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. పటిష్టమైన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ప్రణాళిక ప్రకారం ఆడకుండా కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీమిండియాకు సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారినా.. పూర్తిగా అయితే దారులు మూసుకుపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే ఓ అద్భుతం జరిగి తీరాలి.

Read Also: భారత ఆటగాళ్లకు మానసిక ధైర్యం లేదు : గంభీర్

గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో పాటు అప్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ ఉన్నాయి. భారత్ తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో ఆడి ఓటమి పాలైంది. మిగతా మూడు మ్యాచ్‌లలో పసికూనలతో తలపడాల్సి ఉంటుంది. వీటిలో భారత్ విజయం సాధించడం సులభమే. అయితే న్యూజిలాండ్ కూడా ఈ మూడు జట్లపైనే ఇంకా ఆడాల్సి ఉంది. పాకిస్థాన్‌కు దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారైనట్లే. ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరనున్న రెండో జట్టు భవితవ్యమే తేలాల్సి ఉంది. న్యూజిలాండ్ ఇప్పటికే భారత్‌పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ టీమిండియా సెమీస్‌కు చేరాలంటే పసికూనలపై ఆడాల్సి ఉన్న మూడు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఒక మ్యాచ్‌లో తప్పనిసరిగా ఓడిపోవాలి. అంతేకాకుండా పసికూనలపై భారత్ భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు మాత్రమే టీమిండియా సెమీస్ చేరగలదు.

ఇప్పటికైతే భారత్ అభిమానుల ఆశలన్నీ న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌పైనే. ఈ మ్యాచ్ నవంబర్ 7న జరగుతుంది. అయితే అంతకంటే ముందే ఆప్ఘనిస్తాన్‌తో ఈనెల 3న భారత్ తలపడనుంది. కాగా మన ఆటగాళ్లలో సత్తా లేనప్పుడు ఇతరులు ఓడిపోవాలని కోరుకోవడం అత్యాశే అవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే మనిషి నైజం ఆశించడమే కాబట్టి న్యూజిలాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదని మరికొందరు వాదిస్తున్నారు. చూడాలి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందో?

Exit mobile version