NTV Telugu Site icon

కోహ్లీపై విమర్శలు.. కిషన్‌ను కాదని పాండ్యాను తీసుకుంటారా?

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు ఒత్తిడికి చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇషాన్ కిషన్ పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో కనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ తన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ అతడు ఆకట్టుకున్నాడు.

Read Also: పొట్టి ప్రపంచ కప్ లో కోహ్లీ అరుదైన రికార్డ్స్

ఇలా వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో అందరూ కోహ్లీని విమర్శిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను ఎందుకు తుదిజట్టులోకి తీసుకోలేదని వారు మండిపడుతున్నారు. మరోవైపు హార్ధిక్ పాండ్యా ఫామ్‌, ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నాయి. పైగా పాక్‌తో మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్ కూడా వేయలేదు. అలాంటప్పుడు హార్ధిక్ పాండ్యా బదులు ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు చోటు ఇస్తే మ్యాచ్ మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.