NTV Telugu Site icon

చిత్ర‌సీమ‌లో గురువులు

Teachers Day:Tollywood Teachers Special Story

Teachers Day:Tollywood Teachers Special Story

త‌న పుట్టిన‌రోజున ఉపాధ్యాయ దినోత్స‌వంగా ప్ర‌క‌టించాల‌ని ఆ నాటి రాష్ట్ర‌ప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ ఆకాంక్షించారు. అప్ప‌టి నుంచీ ఆయ‌న పుట్టిన‌రోజ‌యిన సెప్టెంబ‌ర్ 5న దేశ‌వ్యాప్తంగా గురుపూజ్యోత్సం సాగుతోంది. చిత్ర‌సీమ‌లోనూ ఈ సంప్ర‌దాయం కొన‌సాగేది. తెలుగు సినిమా రంగంలో గురువు అన్న ప‌దం విన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావే. ఆయ‌న శిష్య‌ప్ర‌శిష్యులు ఈ నాటికీ చిత్ర‌సీమ‌లో ద‌ర్శ‌కులుగా వెలుగొందుతూనే ఉన్నారు. త‌మ‌ను సినిమా రంగానికి ప‌రిచ‌యం చేసిన వారిని, ఎక్కువ అవ‌కాశాలు క‌ల్పించిన వారిని, పేరు తెచ్చిన అవ‌కాశాలు ఇచ్చిన వారినీ కూడా చిత్ర‌సీమ‌లో గురువులుగానే భావిస్తూ ఉంటారు. అలాంటి గురువులు ఎవ‌రెవ‌రికి ఏం చేశారో గురుపూజ్యోత్స‌వం సంద‌ర్భంగా మ‌న‌నం చేసుకుందాం.

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు గారు త‌న‌ను చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యంచేసిన ఎల్.వి.ప్ర‌సాద్ ను, త‌న‌తో మ‌ల్లీశ్వ‌రి వంటి క‌ళాఖండాన్ని తెర‌కెక్కించిన బి.య‌న్.రెడ్డిని, త‌న‌ను పాతాళ‌భైర‌వితో సూప‌ర్ స్టార్ గా నిలిపిన కేవీ రెడ్డిని గురుతుల్యులుగా భావించేవారు. అలాగే వారు వ‌చ్చి త‌న‌ను ఏదైనా కోరినా, వెంట‌నే అందుకు అంగీక‌రించి, తాను వారి రుణం తీర్చుకోలేక‌పోయినా, దానిని గురుద‌క్షిణ‌గా భావించేవారు. య‌న్టీఆర్ స్వీయ ద‌ర్వ‌క‌త్వంలో రూపొందించి, న‌టించిన త‌ల్లా పెళ్ళామా చిత్రాన్ని ఎల్.వి.ప్ర‌సాద్ చూడ‌గానే, ఆ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ఇవ్వ‌మ‌ని అడిగారు. రామారావు గురుద‌క్షిణ‌గా తాను రాసిన క‌థ‌ను ఏమీ తీసుకోకుండానే ఇచ్చేశారు. అలాగే బి.య‌న్. రెడ్డి కోర‌గానే ఆయ‌న నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బంగారు పంజ‌రం చిత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఇక కేవీ రెడ్డి కోరిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న నిర్మించిన చిత్రాల‌లో న‌టించారు. అలాగే తాను నిర్మించిన తొలి రంగుల చిత్రం శ్రీ‌కృష్ణ స‌త్య‌కు గురువు కేవీరెడ్డినే ద‌ర్శ‌కునిగా నియ‌మించుకున్నారు.

ఇక న‌ట‌స‌మ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు చిత్ర‌సీమ‌లో ఇద్ద‌రు గురువులు. వారిలో దుక్కిపాటి మ‌ధుసూద‌న‌రావు మొద‌టివారు. ఏయ‌న్నార్ నాట‌కాలు వేస్తున్న రోజుల నుంచీ ఆయ‌నను తీర్చిదిద్దారు దుక్కిపాటి. అందుకే ఆయ‌న‌తో క‌ల‌సి అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్ సంస్థ‌ను నెల‌కొల్పారు. ఈ గురుశిష్యుల‌బంధం గురించి తెలుగు చిత్ర‌సీమ‌లో అంద‌రికీ తెలుసు. గురువు నిర్మించే చిత్రాలు విజ‌యం సాధించాల‌ని ఈ శిష్యుడుకోరుకోగా, త‌న శిష్యుడు ఏయ‌న్నార్ కు తాను వైవిధ్య‌మైన చిత్రాలు అందించాల‌ని గురువు అభిల‌షించేవారు. ఇక మ‌రో గురువు ఎవ‌రంటే త‌న‌ను సీతారామ‌జ‌న‌నంతో త‌న‌ను చిత్ర‌సీమ‌కు పరిచ‌యం చేసిన ఘంట‌సాల బ‌ల‌రామ‌య్య‌. ఆయ‌న తెర‌కెక్కించిన బాల‌రాజు చిత్రంతోనే ఏయ‌న్నార్ కు ఎన‌లేని పేరు ల‌భించింది. బ‌ల‌రామ‌య్య చివ‌ర‌గా రేచుక్క‌ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ క‌న్నుమూశారు. పి.పుల్ల‌య్య ఆ సినిమాను పూర్తి చేశారు. అందులో య‌న్టీఆర్ హీరో అయినా, ఓ పాట‌లో క‌నిపించి గురువును మ‌ర‌చిపోలేద‌ని నిరూపించుకున్నారు ఏయ‌న్నార్.

కృష్ణ అంత‌కు ముందే కొన్ని చిత్రాల‌లో బిట్ రోల్స్ లో క‌నిపించినా, ఆయ‌న హీరోగా న‌టించిన తొలి చిత్రం తేనెమ‌న‌సులు. ఆదుర్తి తెర‌కెక్కించిన ఈ చిత్రం ద్వారా కృష్ణ‌తో పాటు రామ్ మోహ‌న్ కూడా హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌రువాత కృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు. త‌న‌ను హీరోగా నిలిపిన ఆదుర్తి సుబ్బారావును కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి నిర్మించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మాయ‌దారి మ‌ల్లిగాడులో కృష్ణ పారితోషికం పుచ్చుకోకుండా న‌టించారు. శోభ‌న్ బాబు తొలిసారి తెర‌పై క‌నిపించిన చిత్రం దైవ‌బ‌లం. ఈ చిత్రంలో య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు. ఈ సినిమా త‌రువాత శోభ‌న్ బాబు స్టార్ కావ‌డానికి దాదాపు పుష్క‌ర‌కాలం ప‌ట్టింది. శోభ‌న్ బాబుకు వెంట‌నే త‌న సీతారామ‌క‌ళ్యాణం చిత్రంలో అవ‌కాశం క‌ల్పించారు య‌న్టీఆర్. ఆ త‌రువాత దాదాపు య‌న్టీఆర్ న‌టించిన 20 చిత్రాల‌లో శోభ‌న్ బాబుకు ఏదో ఒక పాత్ర ఇప్పిస్తూ వ‌చ్చారు రామారావు. అందువ‌ల్ల య‌న్టీఆర్ ను శోభ‌న్ బాబు గురువుగా భావించేవారు. అందువ‌ల్లే త‌మ నివాసంలో య‌న్టీఆర్ పెద్ద ప‌టం పెట్టుకొని ఆరాధించేవారు శోభ‌న్. కృష్ణంరాజును చిల‌కా గోరింకా చిత్రం ద్వారా తెర‌కు ప‌రిచ‌యం చేశారు కె.ప్ర‌త్య‌గాత్మ‌. అందువ‌ల్ల ఆయ‌న‌ను గురువుగా భావించి గౌర‌వించేవారు కృష్ణంరాజు.

మోహ‌న్ బాబు త‌న‌ను చిత్ర‌సీమ‌లో హీరోగానిలిపిన దాస‌రి నారాయ‌ణ‌రావును గురువుగా ఆరాధించేవారు. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు. గురువు దాస‌రి నిర్మించిన చిత్రాల‌లో మోహ‌న్ బాబు అనేక‌సార్లు పారితోషికం పుచ్చుకోకుండా న‌టించారు. దాస‌రి, మోహ‌న్ బాబు బంధం గురించి తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రిన‌డిగినా చెబుతారు. చిరంజీవిలోని న‌టునికి త‌గిన పాత్ర‌లు ఇచ్చి ప్రోత్స‌హించారు కె.బాల‌చంద‌ర్. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇది క‌థ కాదు, 47రోజులు చిత్రాల్లో చిరంజీవి విల‌న్ గా న‌టించినా, న‌టునిగా మంచిపేరు సంపాదించారు. అందువ‌ల్ల బాల‌చంద‌ర్ ను గురువుగా అభిమానిస్తారు చిరంజీవి. ఆ కార‌ణంగానే త‌మ తొలి సొంత చిత్రం రుద్ర‌వీణ‌ను బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనే నిర్మించారు చిరంజీవి. ఇక నంద‌మూరి బాల‌కృష్ణ‌కు గురువు ఎవ‌రంటే ఆయ‌న తండ్రి య‌న్టీఆర్ అని అంద‌రికీ తెలుసు. ఎందుకంటే య‌న్టీఆర్ సినిమాలు చూస్తూనే పెరిగారు. పైగా య‌న్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలోనే న‌టునిగా ఆరితేరారు. అందువ‌ల్ల తండ్రి తార‌క‌రాముణ్ణే గురువుగా ఆరాధిస్తారు, అభిమానిస్తారు బాల‌య్య‌. నాగార్జున త‌న తండ్రి ఏయ‌న్నార్ ను, ద‌ర్శ‌కుడు వి.మ‌ధుసూద‌న‌రావును గురువులుగా గౌర‌విస్తారు. ఇక వెంక‌టేశ్ త‌న‌ను చిత్రసీమ‌లో హీరోగా నిలిపిన కె.రాఘ‌వేంద్ర‌రావును గురువుగారు అంటూ ఎంత‌గానో గౌర‌విస్తారు. గురువు ఏ రోజున కాల్ షీట్స్ అడిగినా లేద‌న‌కుండా ఇచ్చేవారు వెంక‌టేశ్.

ఇలా టాప్ స్టార్స్ కే కాదు, ప్ర‌స్తుతం యంగ్ స్టార్స్ కు కూడా ఎంతోమంది గురువులు ఉన్నారు. ఇక ఆ నాటి మేటి టెక్నీషియ‌న్స్, డైరెక్ట‌ర్స్, నిర్మాత‌లు సైతం త‌మ‌ను చిత్ర‌సీమ‌లో నిల‌దొక్కుకొనేలా చేసిన వారిని గురువుగానే అభిమానించేవారు. అలాంటి వారంద‌రూ గురుపూజ్యోత్స‌వాన త‌మ గురువుల‌ను త‌ల‌చుకుంటూనే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. గురువును త్రిమూర్తుల‌తో పోల్చారు పెద్ద‌లు. అందువ‌ల్ల త‌మ ఉనికికి, స్థితికి, అభివృద్ధికి కార‌కుల‌యిన గురువుల‌ను ఎవ‌రూ మ‌ర‌చిపోరాదు. సినిమారంగంలోనూ త‌మ గురువుల‌ను అంద‌రూ ఆరాధిస్తూనే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు.