సీమలో తిరిగి పట్టుసాధించే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తోందా? రాయలసీమ హక్కుల సాధన ఉద్యమాన్ని తలకెత్తుకుందా? కర్నూలు కేంద్రంగా కృష్ణా జలాలపై తెలుగుదేశం తలపెట్టిన ఆందోళన దేనికి సంకేతం? లెట్స్ వాచ్!
రాయలసీమ హక్కుల సాధన పేరుతో టీడీపీ పోరు!
సాగునీటి ప్రాజెక్టులు.. కృష్ణా, తుంగభద్ర జలాల అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ.. రాయలసీమ హక్కుల సాధనకు ఉద్యమాన్ని ప్రారంభించింది టీడీపీ. సీమ వెనకబాటుతనం.. నిర్మాణంతోపాటు ప్రతిపాదనల్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. నీటి పంపకాలలో రాయలసీమకు న్యాయం జరగాలంటూ కొన్ని రోజులుగా సదస్సులు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు నాయకులు. ఈ కార్యక్రమాల్లో రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను భాగస్వామ్యం చేస్తున్నారు. గత నెల 23 కర్నూలులో ఆరు జిల్లాల టీడీపీ నేతలు సమావేశమైన తర్వాత ఇవి స్పీడప్ అయ్యాయి.
2019 ఎన్నికల్లో సీమలో 54 సీట్లలో టీడీపీ గెలిచింది మూడే!
అధికారం కోసం సీమలో పట్టుకు ప్లాన్?
సీమ హక్కుల సాధనకు టీడీపీ తలపెట్టిన ఈ ఉద్యమం వెనక రాజకీయ వ్యూహం కూడా ఉందట. 2019 ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 54 అసెంబ్లీ సీట్లకుగాను మూడు చోట్లే గెలిచింది. చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. 8 లోక్‌సభ సీట్లలో ఒక్కటీ దక్కలేదు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లున్నాయి. మ్యాజిక్ మార్క్ 88. కోస్తా, ఉత్తరాంద్రలో 121 సీట్లున్నాయి. అక్కడ సగం సీట్లు గెల్చుకుంటే.. మెజారిటీ మార్క్‌కు ఇంకా 25-30 సీట్లు అవసరం పడతాయి. వాటిని రాయలసీమలో పట్టుకోకుంటే ఇబ్బంది పడతామని టీడీపీ గుర్తించింది. అందుకే సీమలో చిన్నగా పావులు కదుపుతోంది. సీమలో వైసీపీ బలంగా ఉంది. అలాంటిచోట పట్టు సాధించాలంటే స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలే అజెండాగా ఉద్యమాన్ని చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టాలనేది టీడీపీ వ్యూహమట.
చివరిలో తిరుపతిలో భారీ సభకు టీడీపీ ప్రణాళిక!
గత నెలలో కర్నూలులో టీడీపీ నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఫరూక్, అమర్‌నాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, కేఈ ప్రభాకర్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీమతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ఏకమవుతామని, తాడో పేడో తేల్చుకుంటామని ప్రకటించారు కూడా. పోలవరం నుంచి గోదావరి జలాలు తీసుకొని కృష్ణా జలాలను సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నికర జలాలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ నాయకులు. ఇదే అంశంపై సీమలోని అన్ని జిల్లాలో సమావేశాలు పెట్టి.. చివర్లో తిరుపతిలో భారీసభ పెట్టాలని నిర్ణయించారట.
రెండేళ్లపాటు సీమలో ఉద్యమాలు!
ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా కర్నూలు జిల్లాలో మాల్యాల వద్ద హంద్రీనీవా ఎత్తిపోతలను టీడీపీ బృందం సందర్శించింది. కృష్ణా జలాల్లో సీమకు అన్యాయం జరుగుతోందని నిరసన తెలిపారు కూడా. సున్నిపెంట నుండి శ్రీశైలం ప్రాజెక్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టును టీడీపీ నాయకులు సందర్శించారు. ఈ విధంగా సీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అజెండాగా ఉద్యమాన్ని చేపట్టిన రాబోయే రెండేళ్లలో మరిన్ని కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.
టీడీపీ నేతలు అంటీముట్టనట్టు ఉంటే ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
రాయలసీమలో చాలా చోట్ల టీడీపీ నేతలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో మౌనం వీడటం లేదు. టీడీపీ పిలుపిచ్చే కార్యక్రమాలను కొందరు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. మరికొందరు ముఖం చాటేస్తున్నారు. నేతల తీరు ఇలా ఉంటే.. సీమ హక్కుల సాధనకు ఉద్యమం చేపడితే ప్రయోజనం ఉంటుందా అని కేడర్ ప్రశ్నిస్తోందట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఓడాకా ఇళ్లకు పరిమితమైన వారితో ఉద్యమం సక్సెస్ అవుతుందా అన్నది చర్చ జరుగుతోంది. మరి సీమలో టీడీపీ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
