ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ దాడి చేసిందని ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు చంద్రబాబు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం వద్దే టీడీపీ అభ్యర్థిపై దాడి జరిగింది. మధ్యాహ్నం జరిగిన దాడిలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 మంది వరకు దాడిలో పాల్గొని వెంకటేశ్‌ను కొట్టారు. వెంకటేశ్‌పై దాడిచేయడమే కాకుండా నామినేషన్ పత్రాలు చించేశారు.
వెంకటేశ్ సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లడంతో పాటు తీవ్రంగా కొట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలి.తక్షణమే కుప్పం ఉప ఎన్నికల్లో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు చంద్రబాబు.
