NTV Telugu Site icon

Bansuri Swaraj: రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె.. బీజేపీలో కీలక పదవిలో నియామకం

Bansuri

Bansuri

మాజీ విదేశాంగ మంత్రి, దివంగత భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమెను ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా నియమించారు. స్వరాజ్ సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని నిర్వహిస్తారు. పార్టీ పూర్తిస్థాయి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా చేసిన తొలి నియామకం ఇది. పార్టీకి సేవ చేసేందుకు ఇదో అవకాశం అని, ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్వరాజ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాకు ధన్యవాదాలు తెలుపుతూ బన్సూరి తన నియామకాన్ని ప్రకటించిన లేఖను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Also Read:Bhatti Vikramarka: రాష్ట్రాన్ని కేసీఆర్ 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు.. బీఆర్ఎస్ పాలనంతా స్కాములమయం

కాగా, ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన బాన్సురి 15 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. గతంలోనూ ఆమె అనధికారికంగా బీజేపీ న్యాయవ్యవహారాల్లో సాయమించారు. ఆమెకు సంస్థాగత పదవిని ఇవ్వడం ఇదే మొదటిసారి. ఢిల్లీ రాజకీయాల్లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి 24న బన్సూరికి పంపిన అపాయింట్‌మెంట్ లెటర్‌లో తక్షణమే ఆమెను నియమిస్తున్నట్లు పేర్కొంది. బిజెపి ఢిల్లీ యూనిట్‌లోని వారు బన్సూరి నియామకాన్ని ప్రశంసించారు. పార్టీ కార్యక్రమాలలో ఆమె తరచుగా పాల్గొంటున్నారు. విశిష్ట మహిళా సాధకులకు ఈ ఏడాది సుష్మా స్వరాజ్ అవార్డులను బీజేపీ మహిళా విభాగం ప్రారంభించింది.

Also Read:Sanju Samson: బంపరాఫర్ కొట్టేసిన సంజూ.. ఇక నెక్ట్స్ అదే!

బీజేపీలో సుష్మా స్వరాజ్ అగ్ర నాయకురాలిగా ఉన్నారు. 2019లో ఆమె కన్నుమూశారు. ఆమె 1977లో హర్యానాలో అత్యంత పిన్న వయస్కురాలైన క్యాబినెట్ మంత్రిగా రికార్డు సృష్టించారు. ఏడు పర్యాయాలు పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన శాఖలను నిర్వహించే ముందు ఆమె ఢిల్లీ సీఎంగా కొద్దికాలం పనిచేశారు. 2014, 2019 మధ్య నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఆమె 2009 మరియు 2014 మధ్య లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా కూడా పనిచేశారు.