మార్చిలోనే ఎండల తీవ్రత ప్రారంభమైంది.. ఏప్రిల్ నెల ఆరంభంలోనూ ఎండలు దంచికొడుతున్నాయి.. తెలంగాణ లోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదు అవుతున్నాయి.. ఇక, ఎండలు, ఉక్కుపోతతో అల్లాడిపోతున్న ప్రజలు.. మధ్యాహ్న సమయంలో అవసరం అయితేనే బయటకు రండి అంటూ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నాయి.. ఎండల తీవ్రత కారణంగా.. ఒంటి పూట బడల సమయాన్ని కూడా ఉదయం 11.30 వరకే కుదించిన విషయం తెలిసిందే కాగా.. అందరికీ ఉపశమనం కలిగించేలా చల్లని కబురు తీసుకొచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
Read Also: CM YS Jagan: రేపు ప్రధాని మోడీతో ఏపీ సీఎం భేటీ.. విషయం అదేనా..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది హైరాబాద్ వాతావరణ కేంద్రం.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట సహా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. పైన పేర్కొన్న జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా.. తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.. ఇక, హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాలు మేఘావృతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. నైరుతి దిశగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని.. గంటకు 06-10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని.. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39 నుండి 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ విభాగం పేర్కొంది.
