Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ వేళ.. తెలంగాణలో సదువులు సాగేనా..?

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత రెండు కరోనా వేవ్‌లతోనే ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో మరోసారి కరోనా రక్కసి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు పాకిన ఈ వేరియంట్‌ భారత్‌లోకి కూడా ఎంటరైంది. ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకు భారత్‌లో పెరుగుతున్నాయి. అంతేకాకుండా మునిపటికంటే ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా విజృంభనతో గత రెండు సంవత్సరాలుగా విద్యాసంస్థలు పూర్తిగా ప్రారంభం కాలేదు.

కొంత మంది ఆన్‌లైన్‌లో క్లాసులు వింటుంటే స్థోమతలేని వారు చేసేదేంలేక వారి పిల్లలను చదువుకు దూరంగా పెడుతున్నారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్‌ వేవ్ తరువాత విద్యాసంస్థలు ప్రారంభించాయి. అంతేకాకుండా సిలబస్‌లో కూడా మార్పులు చేసింది. ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలకు విద్యార్థులు కూడా పూర్తిగా హజరవుతున్న తరుణంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూడడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరోసారి భయం నెలకొంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుండటం, తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయమే.

తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే తెలంగాణలోని పలు పాఠశాలల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు బయట పడుతుండడంతో పాఠశాలకు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రెండు సంవత్సరాలుగా పిల్లలు చదువులకు దూరంగా ఉంటున్నారని.. ప్రభుత్వంపై నమ్మకంతో పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఒమిక్రాన్‌ వేళ.. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పిల్లల సదువులు సాగేనా..? అని ఆలోచిస్తున్నారు.

https://ntvtelugu.com/omicron-variant-spread-over-57-countries/
Exit mobile version