(అక్టోబర్ 10న ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు)
ఆ నాడు దేశంలో అరాచకం అలుముకున్న వేళ ఛత్రపతి వీరోచిత పోరాటం చేసి, మళ్ళీ మన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించారు. అదే తీరున తెలుగు సినిమా ప్రాభవం తరిగిపోతున్న వేళ మరోమారు ప్రపంచ యవనికపై తెలుగు చిత్రాల వెలుగును ప్రసరింప చేసిన ఘనుడు దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లో తెరకెక్కిన ‘స్వర్గసీమ’, ‘మల్లీశ్వరి’, ‘పాతాళభైరవి’ వంటి చిత్రాలు ఎల్లలు దాటి ప్రదర్శితమై, తెలుగు చిత్రాల ఉనికిని చాటాయి. తరువాత అనేక తెలుగు చిత్రాలు మన చిత్రసీమకు గౌరవం సంపాదించి పెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మార్కెట్ విస్తరిస్తున్న వేళ, తన ‘బాహుబలి’ సీరీస్ తో ఒక్కసారిగా అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు రాజమౌళి. భారతదేశంలో ‘బాహుబలి-2’ స్థాయిలో వసూళ్ళ వర్షం కురిపించిన చిత్రమూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి రాబోయే చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’వైపే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక దర్శకునిగా తన చిత్రప్రయాణంలో ఈ యేడాదితోనే ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు రాజమౌళి. తన ఇరవై ఏళ్ళ సినిమా కెరీర్ లో ఇప్పటికి కేవలం 11 చిత్రాలే రూపొందించారు. 12వ చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’ రాబోతోంది. అయినా వంద చిత్రాలు తీసిన అనుభవం ఉట్టిపడేలా సినిమాలను రూపొందించడంలో మేటి అనిపించారు రాజమౌళి. అందుకే కాబోలు జనం రాజమౌళిని ‘జక్కన్న’ అంటూ అభిమానంగా పిలుస్తుంటారు. జక్కన్న తన ఇరవై ఏళ్ళ కెరీర్ లో జైత్రయాత్రనే సాగించారని చెప్పవచ్చు.
అలా… అలా…
ప్రముఖ రచయిత కె.విజయేంద్రప్రసాద్ తనయుడే రాజమౌళి. 1973 అక్టోబర్ 10న కర్ణాటకలోని మాన్విలో జన్మించారు రాజమౌళి. వారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. ఆ రోజుల్లో కొవ్వూరులో కోడూరి వారంటే ఎంతో పేరు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల విజయేంద్రప్రసాద్, ఆయన అన్నలు కలసి కర్ణాటకకు వలస వెళ్ళారు. రాజమౌళి బాల్యం కొవ్వూరులో సాగింది. ఐదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. తరువాత ఏలూరులో హైస్కూల్ విద్య పూర్తి చేశారు. వారి తల్లి రాజనందిని సొంతవూరు వైజాగ్ కావడం వల్ల అక్కడ కూడా రాజమౌళి చాలా ఏళ్ళు గడిపారు. తరువాత కర్ణాటకకు వెళ్ళి కొంతకాలం గడిపారు. తండ్రి విజయేంద్రప్రసాద్, పెదనాన్న శివశక్తిదత్త మద్రాసు చేరిన తరువాత ఒక్కొక్కరు మెల్లగా వారి చెంత చేరారు. అలా తండ్రి వద్దనే మొదట్లో స్క్రిప్ట్ రైటింగ్ లో అసిస్టెంట్ గా ఉన్నారు. సొంతగా రాసుకోవడం మొదలు పెట్టాక, హైదరాబాద్ లో వారి బంధువు అయిన ప్రముఖ నిర్మాత గుణ్ణం గంగరాజు నిర్మించిన సినిమాలకు,సీరియల్స్ కు అసోసియేట్ గా పనిచేశారు. ఈటీవీ కోసం కె.రాఘవేంద్రరావు నిర్మించిన శాంతినివాసం
సీరియల్ కు ఆయన పర్యవేక్షణలోనే రాజమౌళి దర్శకునిగా పనిచేశారు. శాంతి నివాసం
సీరియల్ రూపొందిస్తున్న సమయంలోనే రాజమౌళిలోని స్పార్క్ ను గుర్తించారు రాఘవేంద్రరావు. తరువాత రాఘవేంద్రరావు సమర్పణలో సి.అశ్వనీదత్ తమ స్వప్న సినిమా
పతాకంపై నిర్మించిన స్టూడెంట్ నంబర్ వన్
సినిమాతో రాజమౌళిని దర్శకునిగా పరిచయం చేశారు. ఆ చిత్రం విడుదలయిన మొదటి రోజు మొదటి ఆట నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. యంగ్ టైగర్ యన్టీఆర్ తొలి ఘనవిజయం, దర్శకధీరుడు రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’.
రెండో సినిమాతోనే!స్టూడెంట్ నంబర్ వన్
సక్సెస్ క్రెడిట్ ను ఎందుకనో చాలామంది రాజమౌళికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. తరువాత జూనియర్ యన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వి.దొరస్వామి రాజు నిర్మించిన సింహాద్రి
చిత్రం వచ్చింది. రాజమౌళి రెండో చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాతోనే తన సత్తా ఏమిటో చాటుకున్నారు రాజమౌళి. సింహాద్రి
చిత్రం 175 కేంద్రాలలోశతదినోత్సవం జరుపుకుంది. 50కి పైగా కేంద్రాలలో 175 రోజులు ఆడింది. ఇప్పటికీ సిల్వర్ జూబ్లీస్ లో ఇదే రికార్డ్! ఆ ఘనవిజయం చూసిన తరువాత రాజమౌళి సినిమాలకు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో మూడో చిత్రంగా వచ్చిన సై
తో రాజమౌళి హ్యాట్రిక్ కొడతారని భావించారు. వరుసగా తన మూడు చిత్రాలకు ఎస్
అక్షరంతో ఆరంభమయ్యే టైటిల్స్ పెట్టుకున్నారు. బహుశా తనపేరులో ఎస్.ఎస్. అని ఉంది కాబట్టి, ఎస్
స్టాండ్స్ ఫర్ సక్సెస్ అని భావించారేమో! కానీ, తొలి రెండు చిత్రాలు ఘనవిజయాలతో పోలిస్తే సై
అంతగా ఆకట్టుకోలేక పోయిందనే చెప్పాలి.
‘రాజా’ సెంటిమెంట్!
రాజమౌళి తన నాల్గవ చిత్రానికి ఛత్రపతి
అనే టైటిల్ పెట్టారు. ప్రభాస్ తో రాజమౌళి తొలి చిత్రం ఇది. ఘనవిజయం సాధించింది. తరువాత రవితేజతో విక్రమార్కుడు
. అదీ రవితేజ కెరీర్ లో బిగ్ హిట్. ఆ తరువాత జూ.యన్టీఆర్ తో మూడో చిత్రంగా యమదొంగ
తెరకెక్కించారు. ఇది బ్లాక్ బస్టర్. దాంతో జూనియర్ తో రాజమౌళి హ్యాట్రిక్ చూశారు. ఆ తరువాత రామ్ చరణ్ తో మగధీర
అదిరిపోయే హిట్! స్టార్ హీరోస్ తోనే కాదు కమెడియన్స్ తోనూ బంపర్ హిట్ కొట్టగలనని మర్యాదరామన్న
తో నిరూపించుకున్నారు రాజమౌళి. ఆపై గ్రాఫిక్ మాయాజాలంతో తెరకెక్కించిన ఈగ
కూడా విశేషాదరణ చూరగొంది. చిత్రమేంటంటే, రాజమౌళి సినిమాలతో బంపర్ హిట్స్ చూసిన హీరోలెవ్వరికీ తరువాత నటించిన చిత్రాలు కలసి రాలేదు. అదో సెంటిమెంట్ గా మారిపోయింది. రాజమౌళితో హిట్ కొట్టిన హీరో తరువాతి చిత్రం ఫ్లాప్ అని డిసైడ్ అయి పోవాలని చాలామంది అంటూ ఉంటారు.
అటు వైపే… అందరి చూపు…
రాజమౌళి సినిమాల్లో నటించేవారికి సెంటిమెంట్ ఎలా ఉన్నా, ఆయన మాత్రం కొన్ని చెరిగిపోని సెంటిమెంట్స్ ను చెరిపేశారు. తెలుగులో జానపద చిత్రాలకు అంత ఆదరణ ఉండదు అని జనం అనుకుంటున్న సమయంలో బాహుబలి
వంటి భారీ జానపదాన్ని జనం ముందు నిలిపి, వారి మదిని గెలిచారు రాజమౌళి. బాహుబలి- ద బిగినింగ్
చిత్రం అనూహ్య విజయం సాధించింది. వసూళ్ల పరంగా తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పింది. తరువాతి భాగంగా రూపొందిన బాహుబలి- ద కంక్లూజన్
సమయంలో మళ్ళీ సెంటిమెంట్స్ మోత మోగింది. అదేమిటంటే తెలుగులో సీక్వెల్స్ హిట్ కావు. అందుకు కొన్ని ఉదాహరణలు చూపించారు. ఆ సెంటిమెంట్ ను కూడా చెరిపేస్తూ బాహుబలి-ద కంక్లూజన్
మొదటి భాగం కంటే మిన్నగా విజయం సాధించింది. బాహుబలి
రెండో భాగం నెలకొల్పిన రికార్డులు ఈ నాటికీ సుస్థిరంగా ఉన్నాయి. అందువల్లే ఇప్పుడు ఎవరైనా ఓ రికార్డును సాధిస్తే, నాన్ బాహుబలి
రికార్డ్ అంటూ పేర్కొంటున్నారు. అంతే తప్ప బాహుబలి
ని అధిగమించలేకపోతున్నారు. ఆ తరువాత కరోనా కల్లోలం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు థియేటర్లకే జనాలు వచ్చే విషయం సందిగ్ధంగా మారింది. ఒకవేళ వచ్చినా, కొత్త సినిమాలు,అందునా పేరున్నవారు నటించిన చిత్రాలను మొదటి మూడు రోజుల్లో చూసేస్తున్నారు జనం. తరువాత థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ సమయంలో మళ్ళీ థియేటర్లకు మునుపటి కళ తీసుకు వచ్చేది రాజమౌళి తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్
అని అందరూ భావిస్తున్నారు. ఇటు తెలుగు సినిమా రంగం, అటు భారతీయ చలనచిత్రసీమ ఆర్.ఆర్.ఆర్
ఆగమనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎగ్జిబిటర్స్, బయ్యర్స్ కూడా ఆర్.ఆర్.ఆర్
త్వరగా రావాలని కోరుకుంటున్నారు. ఇంతటి ఘనవైభవం చూసిన దర్శకుడు ఈ మధ్యకాలంలో, అందునా కరోనా కాలంలో మరొకరు కానరావడం లేదని సినీవిశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళి జైత్రయాత్ర మరికొంతకాలం కొనసాగుతూనే ఉంటుందని చెప్పవచ్చు. మరి రాబోయే ‘ఆర్.ఆర్.ఆర్.’తో రాజమౌళి ఏలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.