NTV Telugu Site icon

తుఫాన్ కష్టాలు.. మత్స్యకారులకు పస్తులు

జవాద్ తుఫాను మత్స్యకారులకు కష్టాలు మిగిల్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చేరుకున్నాయి ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు. 44మంది సిబ్బందితో తీర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రతీరంలోకి వెళ్ళడం మానేశారు. ఇటు విజయనగరం జిల్లాలో తుపాన్ ఎఫెక్ట్ తో నాలుగు రోజులు గా వేటకి వెళ్లలేదు మత్స్యకారులు. అయినా అధికారులు తమను, తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.

నెల్లిమర్ల నియోజకవర్గంలో కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వకపోవడంతో పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. అధికారులు రోజూ వచ్చి వేటకు వెళ్ళామో లేదో అని తెప్పలు చెక్ చేస్తున్నారు తప్ప తమ బాగోగులు పట్టించుకోవడం లేదంటున్నారు జాలర్లు. మరోవైపు తుఫాను ముప్పు తప్పినా తీరప్రాంతంలో కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ బీచ్ రోడ్డు వైపు, ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్ లోనూ రాకాసి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కాకినాడ బీచ్ రోడ్డు పైకి సముద్రపు అలలు వచ్చి పడుతున్నాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అల్లకల్లోలంగా సముద్రతీరం

ఇదిలా వుంటే.. తుపాన్ దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం వెంబడి ఈ తుఫాన్‌ పూరీకి చేరుకుంటుందని భావిస్తున్నారు. అనంతరం బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరంలో ఇవాళ గంటకు 110 కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రకు భారీ ముప్పు తప్పినా.. మత్స్యకారుల చేపల వేటపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.