NTV Telugu Site icon

రివ్యూ : శ్రీదేవి సోడా సెంటర్

Sridevi Soda Center Movie Review

Sridevi Soda Center Movie Review

గత యేడాది సెప్టెంబర్ 5న కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో సుధీర్ బాబు ‘వి’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. జనవరిలో అది థియేట్రికల్ రిలీజ్ అయినా ప్రతికూల ఫలితమే దక్కింది. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. గత యేడాది మార్చిలో వచ్చిన ‘పలాస’ మూవీతో దర్శకుడిగా పరిచయమై, మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ తెరకెక్కించిన రెండవ చిత్రమిది. ‘భలే మంచిరోజు, ఆనందోబ్రహ్మ, యాత్ర’ వంటి భిన్నమైన చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు.

కథగా చెప్పుకోవాలంటే సింపుల్. అమలాపురం సమీపంలోని ఓ గ్రామంలో ఉండే సూరిబాబు ఫంక్షన్స్ కు లైటింగ్ ఎరేంజ్ చేస్తుంటాడు. ఊరిలో వీరభద్రస్వామి తీర్థం టైమ్ లో సోడా కొట్టు పెట్టిన శ్రీదేవిని చూసి మనసు పారేసుకుంటాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో శ్రీదేవి తండ్రి వాళ్ళ పెళ్ళికి అంగీకరించడు. మరి ఈ కులం అడ్డుగోడల్ని బ్రద్దలు చేసి వీరిద్దరూ పెళ్ళిచేసుకున్నారా? ఒకవేళ పెళ్ళి చేసుకున్నా…పెద్దలు వీరిని సక్రమంగా కాపురం చేసుకోనిచ్చారా? అనేది మిగతా కథ. ప్రేమ పెళ్ళిళ్ళకు కులం ప్రతిబంధంగా మారిన సినిమాలు దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. ఇక కొన్నేళ్ళుగా వాటికి పరువు హత్యలూ జతకలిశాయి. ఆ రెండు అంశాలను ప్రధానంగా చేసుకున్ని రాసుకున్న కథ ‘శ్రీదేవి సోడా సెంటర్’.

దానివల్ల సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఒకే మూసలో పోతున్నట్టుగా ఉంటుంది. పోనీ సూరిబాబు, శ్రీదేవి ప్రేమను కొత్తగా ఏమైనా చూపించారా? అంటే అదీ లేదు! సినిమా ప్రథమార్థం ‘ఉప్పెన’ను తలపించింది. పెద్దింటి అమ్మాయితో పేదింటి కుర్రాడు ప్రేమలో పడటం, గుట్టుగా ప్రేమాయాణం సాగించడం, పెళ్ళికి ముందు లభించిన ఏకాంత సమయంలో వారు కామోద్రేకాలను చల్లార్చుకోవడం, ఊరు వదిలి పారిపోవడం… ఇవన్నీ ఆ సినిమాలో చూసిన సన్నివేశాలే! ఇక హీరో జైలుకు వెళ్ళడం, అక్కడ జరిగే చిల్లర గొడవలు, భయంకర పోరాట దృశ్యాలు… సినిమా నిడివిని పెంచడానికి తీసినట్టు అనిపిస్తాయి. పైగా ఈ యేడాదే వచ్చిన ‘మాస్టర్, నాంది, చెక్’ వంటి సినిమాల్లో ఈ తరహా సన్నివేశాలను చూసేశాం. హీరో హీరోయిన్లు ఊరు వదిలిపారిపోవడం, హీరోయిన్ కు పెళ్ళై పోయిందని తెలిసి హీరో పిచ్చోడిలా తయారవడం వంటివి అప్పుడెప్పుడో వచ్చిన ‘ప్రేమిస్తే’ సినిమాను జ్ఞప్తికి తెస్తాయి.

సహజంగా ఇలాంటి సినిమాలలో కులమే మెయిన్ విలన్. పరువు, ప్రతిష్ఠ అంటూ పాకులాడే తండ్రి ప్రతీకారం తీర్చుకోవడానికి అవే అసలు సిసలు ఆయుధాలు. చిత్రం ఏమంటే… ఈ సినిమాలో దర్శకుడు మరో ముందడుగు వేశాడు. కుల పెద్దల చేతికి పరువు హత్యల రక్తాన్ని అంటించాడు. చివరిలో హీరోయిన్ తల్లిపై చిత్రీకరించిన సన్నివేశాలు… ఆ మధ్య వచ్చిన ‘అరవింద సమేత’లోని క్లయిమాక్స్ తో పాటు, ఫక్తు తమిళ చిత్రాల్లోని అతిని తలపిస్తాయి. ద్వితీయార్ధంలో చివరి అరగంట చూస్తున్నప్పుడు ఆ మధ్య నెట్ ప్లిక్స్ లో వచ్చిన ‘పావకథైగళ్’ లోని పరువు హత్యలకు సంబంధించిన ‘ఊర్ ఇరవు’ ఎపిపోడ్ గుర్తుకు రాకమానదు.

‘శ్రీదేవి సోడాసెంటర్’ మూవీ మెయిన్ ప్లస్ పాయింట్ నటీనటులు. సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఆ పాత్రలో లీనమైపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీని ముందొచ్చిన ‘వి’లో చూపించినా, ఈ సినిమాలో వలకట్ల పోటీలో దానిని ప్రదర్శించడం బాగుంది. కథానాయిక ఆనంది సైతం సోడాల శ్రీదేవిగా బాగా నటించింది. ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె తండ్రిగా సీనియర్ నటుడు నరేశ్ చక్కని నటన ప్రదర్శించాడు. తనలో తాను మాట్లాడుకోవడం, ఒంటిమీద బన్నీని మాటిమాటికి కిందకు లాక్కోవడం వంటి చర్యలు మధ్యతరగతి తండ్రి పాత్రను మరింతగా ఎలివేట్ చేశాయి. పరువు హత్యల నేపథ్యంలో వచ్చిన ‘ఉప్పెన’లో ప్రముఖ తమిళనటుడు విజయ్ సేతుపతి అద్భతంగా చేశాడు కానీ, ఇందులో తమిళ నటుడు పావెల్ నవ గీతన్… కాశీ పాత్రలో మెప్పించలేకపోయాడు. విలన్ పాత్ర తేలిపోయింది. అతని తండ్రి పాత్ర పోషించిన గోపరాజు రమణ ద్వితీయార్థంలో ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. హీరో తండ్రిగా రఘుబాబు, స్నేహితుడిగా ‘సత్యం’ రాజేష్, జైల్లో రౌడీగా అజయ్, హీరోహీరోయిన్లకు నీడ నిచ్చే జంటగా హర్షవర్థన్, రోహిణి, హీరోయిన్ తల్లిగా కళ్యాణీ రాజ్, లాయర్ గా అరిపిరాల సత్యప్రసాద్ బాగానే చేశారు. సప్తగిరి కనిపించేది ఒక్క సీన్ లోనే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా కన్నుమూసిన కత్తి మహేశ్ సైతం ఓ సీన్ లో బ్రోకర్ పాత్రలో కనిపిస్తాడు. మణిశర్మ సంగీతం, శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చక్కగా ఉంది. ఈ సినిమాలో మాటలూ అర్థవంతంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘పెద్ద మనిషి అంటే చేతిలో ముద్ద పెట్టాలి కానీ లాగేసుకోకూడదు’ వంటి సంభాషణలు ఆలోచింప చేస్తాయి.

‘శ్రీదేవి సోడా సెంటర్’ గోలీసోడాల కాలం నాటి కథ. దాన్ని కాస్తంత కొత్తగా, ఆసక్తికరంగా తీసి ఉంటే బాగుండేది. పైగా ఇవాళ మతాంతర వివాహాలకూ జనం ఆమోద ముద్ర వేస్తున్నారని ఓ పక్క దర్శకుడు చెబుతూనే, కులాంతర వివాహాల మీద రొట్టకొట్టుడు కథతో దీనిని తీయడం చిత్రమే! అయితే నిర్మాతలు మాత్రం ఎక్కడా రాజీ పడకుండా ఈ కథను తెరకెక్కించారు. ఆ ప్రయత్నం తెర మీద కనిపిస్తోంది. సామాజికాంశాలపై మక్కువ ఉన్నవారికి ‘శ్రీదేవి సోడా సెంటర్’ నచ్చే ఆస్కారం ఉంది. అలానే సుధీర్ బాబు ఫ్యాన్స్ కూ ఈ సినిమా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్

మైనెస్ పాయింట్స్

ట్యాగ్ లైన్: గ్యాస్ లేని సోడా!

రేటింగ్ : 2.5 / 5