NTV Telugu Site icon

20 ఏళ్ళ ‘శ్రీమంజునాథ’

Sri Manjunatha Movie Completes 20 Years

(జూన్ 22న ‘శ్రీమంజునాథ’ 20 ఏళ్ళు పూర్తి)

ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం ‘శ్రీమంజునాథ’. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అక్కడి ధర్మస్థల క్షేత్రం కూడా సుప్రసిద్ధమైనది. ఇక్కడి దేవుడు శ్రీమంజునాథునిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆయన మహిమతో జన్మించిన మంజునాథ అనే భక్తుని కథతో తెరకెక్కిన చిత్రమే ‘శ్రీమంజునాథ’. శివునిగా చిరంజీవి, భక్తునిగా అర్జున్ నటించారు. 2001 జూన్ 22న విడుదలైన ‘శ్రీమంజునాథ’ భక్తకోటిని ఆకట్టుకుంది.

కథేమిటంటే…

కన్నడసీమలో ఎందరో శివభక్తులు. అక్కడ స్వామివారిని ‘శ్రీమంజునాథ’గా ఆరాధిస్తూ ఉంటారు. కర్ణాటకలో మగపిల్లలకు మంజునాథ అని, అమ్మాయిలకు మంజుల అని నామకరం చేయడం కూడా చూస్తూ ఉంటారు. ధర్మస్థల క్షేత్రంలో వెలసిన శివుని ఆరాధిస్తూ ఉండే ఓ దంపతులకు పుట్టిన మంజునాథుడు, దేవుడే లేడని అంటూ ఉంటాడు. పెళ్ళయిన తరువాత అతనిలోనూ దేవుడు ఉన్నాడనే జిజ్ఞాస కలుగుతుంది. ఆ తరువాత శివుడు మంజునాథుని పలు విధాల పరీక్షిస్తాడు. ధర్మక్షేత్రలో అనుమతి నిరాకరణకు గురయిన మంజునాథుడు తన భక్తిగీతంతో దీపాలు వెలిగిస్తాడు. శివుని నమ్ముకున్న మంజునాథుడు కోటిలింగాల యజ్ఙం చేస్తాడు. దేవుని పరీక్షలో మంజునాథుని తనయుడు కూడా మరణిస్తాడు. పలు పరీక్షలకు గురిచేసినా, మంజునాథుడు, అతని భార్య ఆ మహాదేవునే నమ్ముకుంటారు. చివరకు ఆ దంపతులు శివసాయుజ్యం పొందుతారు.

నటీనటవర్గం…

‘శ్రీమంజునాథ’ చిత్రంలో చిరంజీవి శివునిగా పూర్తి స్థాయి పాత్రను పోషించారు. అంతకు ముందు ‘పార్వతీపరమేశ్వరులు’ చిత్రంలో “నాదనిలయుడే శివుడు…” పాటలో తొలిసారి చిరంజీవి శివునిగా తెరపై కనిపించారు. ఆ తరువాత ‘ఆపద్బాంధవుడు’లోని “అవతరించుము దేవరా… గిరిసుతా హృదయేశ్వరా…” పాటలోనూ శివుని గెటప్ లో అలరించారు చిరంజీవి. ఇక యాక్షన్ కింగ్ గా పేరొందిన అర్జున్ ఈ చిత్రంలో భక్త శిఖామణి మంజునాథునిగా ఆకట్టుకున్నారు. మీనా పార్వతీదేవిగా నటించిన ఈ చిత్రంలో సౌందర్య, సుమలత, అంబరీశ్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ఆనంద్, ప్రవీణ్ గౌడ్, కుమార్ గోవింద్, మాస్టర్ ఆనంద్ తదితరులు నటించారు. నారా భారతీదేవి సమర్పణలో చిన్ని ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘శ్రీమంజునాథ’కు కథ, మాటలు జె.కె.భారవి సమకూర్చారు. హంసలేఖ స్వరకల్పనకు వేదవ్యాస, భువనచంద్ర, చంద్రబోస్, జొన్నవిత్తుల, సామవేదం షణ్ముఖ శర్మ, విశ్వనాథ శాస్త్రి పాటలు రాశారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నారా జయశ్రీదేవి నిర్మాత.

పరవశింపచేసే పాటలు…

‘శ్రీమంజునాథ’ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించారు. చిరంజీవి, అర్జున్, మీనా, సౌందర్య, అంబరీశ్, సుమలత రెండు భాషల్లోనూ నటించారు. ఈ చిత్రం పేరు వినగానే ఇందులోని “ఓం మహాప్రాణదీపం… శివం… శివం…” అనే పాట ముందుగా గుర్తుకు వస్తుంది. సంస్కృతంలో సాగే ఈ గీతాన్ని వేదవ్యాస రాశారు. సంప్రదాయ భక్తిగీతాలు సైతం అనువైన చోటు చేసుకున్నాయి. మొత్తం 15 పాటలున్న ‘శ్రీమంజునాథ’ ఆడియో కన్నడ నాట విశేషంగా భక్తకోటిని పరవశింపచేసింది. “అక్షరాయ నమః…” , “ఆనంద పరమానంద…”, “ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే…”, “ఎన్ని జన్మల ఫలమిది…” పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని తమిళంలో అనువాదం చేసి, ఓ రెండు నెలల తరువాత విడుదల చేశారు. ఈ సినిమాకు ముందు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో జె.కె.భారవి రచనతోనే ‘అన్నమయ్య’ చిత్రం రూపొంది, అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రానికి కూడా మరోమారు కథ, మాటలు సమకూర్చి జె.కె.భారవి తనదైన మార్కు ప్రదర్శించారు. రాఘవేంద్రరావు సైతం తనపంథాలోనే పయనించి, చిత్రాన్ని భారీగా రూపొందించారు. శివభక్తులను విశేషంగా ఆకట్టుకున్న ‘శ్రీమంజునాథ’, ఇప్పటికీ శివరాత్రి పర్వదినాన దర్శనమిస్తూ అలరిస్తూ ఉంటుంది.