Site icon NTV Telugu

ఇల్లెందు టీఆర్ఎస్‌లో సింగరేణి సెగ !

ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే పార్టీలోనే ఉన్నా.. ఐక్యత లేదు. అంశం ఏదైనా వీరి మధ్యకు వస్తే రచ్చే. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘం పదవులకు ప్రతినిధుల ఎంపికలోనూ పంతాలకు పోతున్నారట. పెద్దల మధ్య తలదూర్చడం ఎందుకని అనుకున్నారో ఏమో.. ఎంపిక ప్రక్రియను ఆపేశారు యూనియన్‌ ప్రతినిధులు.

టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్ష పదవుల కోసం టీఆర్‌ఎస్‌ పోటీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో యూనియన్‌ పదవుల పంపకం వివాదంగా మారింది. TBGKSలో రెండు ఉపాధ్యక్ష పదవుల కోసం అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ పోస్టుల కోసం ఇల్లెందు, కొత్తగూడెంలలో ఓ రేంజ్‌లో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య వర్గాల మధ్య ఈ సమస్య రాజుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోల్‌ బెల్ట్‌లో రాజకీయంగా కీలక పదవులు కావడంతో వీటిని తమవర్గం వారికే కట్టబెట్టేందుకు ఇద్దరు ప్రజాప్రతినిధులు చూస్తున్నారు.

also read : అందాలు ఆరబోస్తున్న మిల్కీ బ్యూటీ..

రంగనాథ్‌కు ఎమ్మెల్యే మద్దతు.. కోటిరెడ్డికి కనకయ్య సపోర్ట్‌!

ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌, జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్యలు టేకులపల్లిలోనే నివాసం ఉంటారు. ఆ ఇంటిపై కాకి.. ఈ ఇంటిపై వాలదన్నట్టుగా ఇక్కడ టీఆర్‌ఎస్‌ రాజకీయాలు సాగుతుంటాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌గా తన వర్గానికి చెందిన రంగనాథ్‌కు కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఒకవైపు పావులు కదుపుతుంటే.. కోటిరెడ్డికి ఇవ్వాలని కనకయ్య పట్టుబడుతున్నారు. ఈ పోస్టు ఖాళీ అయ్యి నాలుగు నెలలు అవుతున్నా.. రెండు వర్గాల ఆధిపత్య పోరు కారణంగా భర్తీ చేయడం లేదు. ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్‌ మధ్య రాజీకి యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డిలు ప్రయత్నించి విఫలం అయ్యారు. కొత్తగూడెంలో ఇటీవలే ఈ అంశంపై పంచాయితీ పెట్టారట.

యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులూ చెరోవర్గానికి మద్దతు
కొత్తగూడెం కార్పొరేట్‌ ఆఫీస్‌లోని పదవి కోసం పైరవీలు

ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా ఉంది. ఎమ్మెల్యే మద్దతిచ్చిన రంగనాథ్‌కు యూనియన్‌ అధ్యక్షుడు వెంకట్రావు సపోర్ట్‌ చేస్తుంటే.. కనకయ్య ఆశీసులు ఉన్న కోటిరెడ్డికి యూనియన్‌ కార్యదర్శి రాజిరెడ్డి అండగా ఉన్నారట. దీంతో సమస్య ఇంకా రసవత్తరంగా మారినట్టు చెబుతున్నారు. మరో రెండు నెలలో మరో వైస్‌ ప్రెసిడెంట్‌పోస్ట్‌ కూడా ఖాళీ కాబోతోంది. కొత్తగూడెం కార్పొరేట్‌ ఆఫీసుకు సంబంధించిన ఆ పదవి కోసం పైరవీలు మొదలయ్యాయట. అసలే ఇల్లెందులో ఒక వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి కొలిక్కి రాక రాజకీయ మంటలు రేపుతుంటే.. ఇప్పుడు కొత్తగూడెంలో ఉపాధ్యక్ష పదవిని తేల్చుతారా నాన్చుతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కార్పొరేట్‌ ఆఫీస్‌లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న కార్మిక నాయకులపై విజిలెన్స్‌ కేసులు పెట్టి బదిలీ చేయించారట. ఈ కేసుల వెనక అధికారపార్టీలో నెలకొన్న వర్గపోరే కారణంగా చెబుతున్నారు. మరి.. ఈ రెండు పోస్టుల విషయంలో హరిప్రియా నాయక్‌, కోరం కనకయ్యలు రాజీకి వస్తారో లేక రాజకీయంగా రచ్చ రచ్చ చేసుకుంటారో చూడాలి.

Exit mobile version