Site icon NTV Telugu

పదవి రాగానే ఆయన స్థాయి మారిందా…?

నగర స్థాయి నేతగా ఉన్న ఆయన… నామినేటెడ్ పదవి రావటంతో ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. ఆయన రాజకీయ అరంగ్రేటం ఒకవర్గం నుంచి జరగ్గా.. ప్రస్తుతం ఆయన కలిసి పనిచేయాల్సిన నేత ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు. అదే ఆయనకు తలనొప్పిగా మారిందట. ఆ నేత కలిసి పనిచేస్తున్పప్పటికీ ఆయన సామాజికవర్గంలోని కొందరు మాత్రం లోలోపల గొణుక్కుంటున్నారట. మరికొందరైతే సోషల్ మీడియాలో ట్రోల్‌ చేసేస్తున్నారట. దీంతో కొత్త పదవి కత్తి మీద సాములా మారిందట. ఆయనెవరో ఇప్పుడు చూద్దాం.

వంగవీటి రాధా అనుచరుడిగా అడపా శేషు రాజకీయ ప్రస్థానం!

బెజవాడ రాజకీయాలు అంటే ఎక్కడైనా ఒకే కానీ ఆ ఒక్క క్యాస్ట్‌ ఫీలింగ్‌ దగ్గర మాత్రం అస్సలు రాజీపడేది లేదంటారు అక్కడి నేతలు. అదే ఇప్పుడు నేతలకు సమస్యగా మారింది. విజయవాడ నగర వైసీపీ నేత అడపా శేషుకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది ప్రభుత్వం. పదవి వచ్చిన తర్వాత ఆయనకు కొత్త కష్టాలు మొదలయ్యాయట. అడపా శేషు రాజకీయ ప్రస్థానం మొదలైంది వంగవీటి కుటుంబం నుంచే. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలోనే ఆయనతోపాటు ఉన్నవారిలో శేషు కూడా ప్రధాన అనుచరుడు. 2005లో జరిగిన ఎన్నికల్లో శేషుకు కార్పొరేటర్ టికెట్‌ను తన నియోజకవర్గంలో ఇప్పించారు రాధా. ఆ ఎన్నికల్లో తొలిసారి ఆయన కార్పొరేటర్‌గా గెలిచారు కూడా.

గౌతంరెడ్డితో వచ్చిన వివాదంలో రాధ వెంట ఉన్నారు అడపా శేషు!

ఆ తర్వాత రాధా కాంగ్రెస్‌ను వీడి ప్రజారాజ్యంలో చేరారు. అయితే శేషు కాంగ్రెస్‌ను వీడకుండా అదేపార్టీలో కొనసాగినప్పటికీ రాధాతో సంబంధాలు చెడిపోలేదని చెబుతారు. వంగవీటి రాధా వైసీపీలో చేరిన తర్వాత మళ్లీ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. రాధా వైసీపీలో ఉన్న సమయంలోనే అదేపార్టీకి చెందిన గౌతంరెడ్డి వంగవీటి రంగాపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. గౌతంరెడ్డి ఇంటికి వెళ్తానని రాధా ప్రకటించినప్పుడు వెంట నడిచారు. తర్వాత కాలంలో రాధా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ గూటిలో చేరారు.

వైసీపీలో దేవినేని అవినాష్‌తో కలిసి అడపా శేషు ప్రయాణం!

మొన్నటి ఎన్నికల్లో విజయవాడ తూర్పులో వైసీపీ నుంచి బొప్పన భవకుమార్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడా నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా దేవినేని అవినాష్‌ ఉన్నారు. మొదటి నుంచి వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వైరం ఉంది. ఇక్కడ వర్గీయులు అక్కడకు, అక్కడ వారు ఇక్కడ పనిచేసింది చాలా అరుదనే చెప్పాలి. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా దేవినేని అవినాష్ వచ్చినప్పటి నుంచి పట్టుకోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఆ సమయంలో తన రాజకీయ భవిష్యత్‌ కోసం అడపా శేషు కూడా అవినాష్ వర్గంతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చినా… కాపు సామాజికవర్గంతో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పని చేసుకుపోయారు. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ టికెట్ పొంది రెండోసారి కార్సొరేటర్‌గా గెలిచారు. డిప్యూటీ మేయర్ పదవి ఆశించినా దక్కలేదు. ఇప్పుడు ఏకంగా కాపు కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను చేశారు.

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ హోదాలో అవినాష్‌తో కలిసి పనిచేయడంపై ప్రశ్నలు!
పదవి వచ్చిన సంతోషం కంటే సూటిపోటి మాటలతో తలబొప్పి కడుతోందా?

ప్రస్తుతం దేవినేని అవినాష్‌తో పూర్తి స్థాయిలో శేషు పనిచేయాలి. ఇది కొందరు కాపు సామాజిక వర్గం నేతలకు మింగుడుపడటం లేదట. పదవి వచ్చిన తర్వాత అవినాష్‌ను కలిసి అడపా శేషు సన్మానించటం ఆ వర్గాలకు మంట పుట్టించిందట. దీనిపై శేషును సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కార్పొరేటర్‌గా అవినాష్‌తో కలిసి మెలిసి తిరిగినా పెద్దగా పట్టించుకోని అడపా సామాజికవర్గం.. ఆయన కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అయ్యాక అదెలా కుదురుతుందని అంటున్నారట. ఛైర్మన్‌గా రేంజ్‌ పెరిగింది. ఇకపై అవినాష్‌తో గ్యాప్‌ మెయింటైన్‌ చేయాలని ఒత్తిడి చేస్తున్నారట. అంతేనా ఎక్కడ నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోవాలని అంటూ రుస రుసలాడుతున్నారట అడపా సామాజికవర్గం నేతలు. ఇది చూస్తున్న అడపాకు పదవి వచ్చిందన్న సంతోషం కంటే సొంత నేతల సెటైర్లు, సూటిపోటి మాటలు తలనొప్పిగా మారాయట.

తన పని కత్తిమీద సాములా మరిందని భావిస్తున్న అడపా.. అటు అవినాష్‌ వర్గంలో కలిసి పనిచేస్తూనే రంగా అభిమానులతో ఇబ్బంది లేకుండా పనిచేయడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరి ఈ సమస్యను ఆయన ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.

Exit mobile version