Site icon NTV Telugu

వరంగల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి పదవికి గండం…?

వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భౌగోళిక మార్పులు ఆ ప్రజాప్రతినిధి పదవికి ఎసరు పెడుతున్నాయా? ఇరుకున పెట్టాలనే వైరివర్గం చక్రం తిప్పిందా? చివరిక్షణంలో మారిన పరిణామాలు దేనికి సంకేతం? ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరి పదవికి ముప్పు పొంచి ఉంది?

హన్మకొండజిల్లాలో కలిసిన శాయంపేట.. ఇరకాటంలో గండ్ర జ్యోతి!

గండ్ర జ్యోతి. వరంగల్‌ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌. వరంగల్‌, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై చర్చ ఎలా ఉన్నా.. ఆమె పరిస్థితిపై ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుగా మారిందట. జిల్లాల మార్పులో ఆమె జడ్పీటీసీగా ప్రాతినిథ్యం వహిస్తున్న శాయంపేటను హన్మకొండ జిల్లాలో చేర్చడంతో ఇరకాటంలో పడ్డారు. భౌగోళిక మార్పులు జరిగిన తర్వాత చూస్తే.. హన్మకొండ జిల్లాలోని శాయంపేట జడ్పీటీసీగా ఉన్న ఆమె.. వరంగల్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా ఎలా కొనగుతారనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం గండ్ర అభిమానుల్లో ఇదే చర్చ.

జడ్పీ ఛైర్‌పర్సన్‌గా జ్యోతిని ఎంపిక.. టీఆర్‌ఎస్‌లో ఓవర్గానికి రుచించలేదా?

భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ వెంకటరమణారెడ్డి భార్యే జ్యోతి. గండ్ర టీఆర్‌ఎస్‌లో చేరినందుకు ఆయన భార్యను జడ్పీ ఛైర్‌పర్సన్‌ను చేశారని చర్చ జరిగింది. ఈ ఎంపిక జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నేతలకు రుచించలేదట. కానీ.. పెద్దల నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నా.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జ్యోతి ఎంట్రీకి ఒప్పుకోవడం లేదట. ఒకవేళ వచ్చినా ప్రొటోకాల్‌ ప్రకారం ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడం జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఆమెను ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదని టాక్‌. చివరకు సొంత నియోజకవర్గం పరకాలలోనూ జ్యోతి పాల్గొన్న ప్రొగ్రామ్స్‌ ఒకటో రెండో.

గండ్రను ఇరుకున పెట్టేందుకే పావులు కదిపింది ఎవరు?

జిల్లా విభజన సందర్భంగా భౌగోళిక మార్పులుకు వీలు కలగడంతో.. టీఆర్‌ఎస్‌లోని గండ్ర వ్యతిరేకవర్గం చాలా నేర్పుగా పావులు కదిపినట్టు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో శాయంపేటను హన్మకొండ జిల్లాలో కలిసేలా పావులు కదిపారట. వాస్తవానికి జిల్లా విభజన ప్రస్తావన వచ్చిన కొత్తలోనే జ్యోతి పదవికి ఇబ్బంది రాకుండా శాయంపేటను వరంగల్‌ జిల్లాలోనే ఉంచారు. కానీ.. నోటిఫికేషన్‌లో ప్రస్తావించిన 30 రోజుల అభ్యంతరాల సమయంలో చక్రం తిప్పింది ఎవరన్నదే ఉత్కంఠ రేపుతోంది. గండ్ర వ్యతిరేకవర్గం బలమైన లాబీయింగ్‌వల్లే శాయంపేట వరంగల్‌ నుంచి హన్మకొండకు వెళ్లిందని అనుకుంటున్నారు.

అభ్యంతరాల పరిశీలనకు గండ్ర దంపతులు దూరం?

ఈ విషయం ముందుగానే లీకైందో ఏమో.. గండ్ర దంపతులు కినుక వహించరాట. అభ్యంతరాల పరిశీలనకు మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే.. వారు డుమ్మా కొట్టారు. కావాలనే తమను బలిచేశారనే ఆక్రోశం.. ఆవేదనలో గండ్ర దంపతులు ఉన్నారట. జ్యోతి పదవికి ముప్పేమీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నా.. సాంకేతికంగా ఒక జిల్లాలో జడ్పీటీసీగా ఉన్న వ్యక్తి.. మరో జిల్లాకు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూసిన గండ్ర అనుచరులు ఇబ్బందుల్లో పడ్డామని.. తమను కావాలనే ఇరకాటంలో పడేశారని అనుకుంటున్నారట. ఇంకోవైపు.. గండ్రకు వ్యతిరేకంగా పావులు కదిపింది ఎవరా అని ఆరా తీస్తున్నవాళ్లూ ఉన్నారు. మరి.. జ్యోతి పదవికి గండం ఉందో లేదో కాలమే చెప్పాలి.

Exit mobile version