ఆ ఒక్క ఉపఎన్నిక.. అధికారపార్టీలోని మిగతా ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఒత్తిళ్లను వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. నిధుల కోసం నియోజకవర్గం దాటి ప్రభుత్వ పెద్దల దగ్గర క్యూ కట్టక తప్పడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ ఫీట్లు.. ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చగా మారాయి.
ప్రభుత్వ పెద్దల దగ్గరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ!
హుజురాబాద్ ఉపఎన్నికపై టీఆర్ఎస్ పూర్తిగా ఫోకస్ పెడితే.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట వారిని ఇరుకున పెట్టే వర్గాలు దృష్టి పెట్టాయి. సొంత పార్టీలోని వైరిపక్షాలు.. విపక్షాలు కలిసి ఇదే టైమ్ అనుకుని తెగ ఆడేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఉపఎన్నిక వస్తుందని.. బై ఎలక్షన్‌తోపాటు నియోజకవర్గానికి నిధులు.. పథకాలు యేరులై పారతాయని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాను ఎడాపెడా వాడేసుకుంటున్నారు. కొత్తలో ఇది కామెడీగా అనిపించినా.. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలకు తత్త్వం బోధపడుతోందట. అసలుకే ఎసరొచ్చేలా ఉందని గ్రహించి.. ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అదే ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ టీఆర్ఎస్‌లో.. ఇతర రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
పెద్దఎత్తున నిధుల కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వేట!
హుజురాబాద్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటిస్తున్న వరాలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో వణుకు పుట్టిస్తోందట. ముఖ్యంగా కోదాడ, ఆలేరు, భువనగిరి, నకిరేకల్ ఎమ్మెల్యేలకు నిద్ర కరువైందట. ఈ సమస్య నుంచి బయట పడాలంటే నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలని నిర్ణయించారట ఎమ్మెల్యేలు. ఏ పేరు పెట్టినా సరే.. తమకు హుజురాబాద్ స్థాయిలో నిధులు ఇస్తే చాలు అని ప్రభుత్వ పెద్దలను.. పార్టీ పెద్దలను కలిసి ప్రాధేయ పడుతున్నారట.
కష్టకాలం నుంచి గట్టెక్కించాలని వేడుకోలు!
నియోజకవర్గాలకు కావాల్సినవి ఏంటి? ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నెరవేర్చాల్సిన అంశాలేంటి? ఇలా ఓ జాబితా సిద్ధం చేసుకుని ఇటీవలే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు పార్టీ ఎమ్మెల్యేలు. ఒక్క కేటీఆర్‌నే కాకుండా.. వివిధ శాఖలకు చెందిన మంత్రులను కలిసి.. ‘బాబ్బాబు.. మీకు పుణ్యముంటుంది.. మాకు ఫలానా పనిచేసి పెట్టండి.. లేదంటే బుర్ర ఫ్రై అయిపోతోంది.. మమ్మల్ని ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించండి చాలు..’ అని తెగ వెంట పడుతున్నారట. ఒకప్పుడు ఎమ్మెల్యేలు వస్తే.. ప్రైవేట్ సంభాషణలకు ఎక్కువ టైమ్ కేటాయించేవారు మంత్రులు. ఇప్పుడు ప్రైవేట్.. పబ్లిక్ టాక్స్ ఏదైనా.. ఒక్కటే! మా నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇస్తారు? ఎప్పటిలోగా ఇస్తారు? ఇప్పుడే చెప్పండి.. ప్రకటన చేయండి అని భీష్మించుకుని కూర్చుంటున్నారట.
ఈ విషయంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. నిధుల విడుదలపై సానుకూల ప్రకటన చేయించకపోతే ఇజ్జత్ పోతుందని తెగ ఫీలవుతున్నారట. మరి.. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.
