Site icon NTV Telugu

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో షాడో పెత్తనం…?

ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే పవర్‌ ఫుల్‌ ఆయన షాడో. జేమ్స్‌బాండ్‌ తరహాలో బుర్రకు పదునుపెడతారు. సెటిల్మెంట్లు.. కమీషన్లు బాగానే ఉండటంతో.. ఆయనేం చేసినా ఎమ్మెల్యే నో చెప్పరని టాక్‌. ఏదైనా భూమి కనిపిస్తే.. వెంటనే జెండా పాతేస్తారట. ప్రస్తుతం ఆ షాడో యవ్వారాలు మూడు భూములు.. ఆరు కోట్లగా ఉందట. ఇంతకీ ఆ షాడో ఎవరో? ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం.

సెటిల్మెంట్లలో మంచిరెడ్డి ‘షాడో’ మంచి నేర్పరి?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం. హైదరాబాద్‌కు ఆనుకుని ఉండే ప్రాంతం. ఇక్కడి భూముల ధరలకు తక్కువ సమయంలోనే రెక్కలు వచ్చాయి. తొండలు గుడ్లు పెట్టని భూములు విలువ నేడు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఈ డిమాండ్‌ను బాగా క్యాష్‌ చేసుకున్నట్టు నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుందో లేదో కానీ.. మంచిరెడ్డికి షాడోగా పేరుగాంచిన ఆ వ్యక్తి కన్నుపడితే ఎలాంటి భూమైనా ఆయన వశమైపోతుందట. నిప్పు లేకుండా పొగరానట్టే.. ఎమ్మెల్యే అండ లేకుండా షాడో ఓ రేంజ్‌లో యవ్వారాలు నడపగలరా అని చెవులు కొరుక్కుంటున్నారు జనాలు.

భూముల లెక్కలన్నీ ‘ఎమ్మెల్యే షాడో’ గుప్పెట్లో?

గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన ఆయన గడిచిన పదేళ్లుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి దగ్గరే ఉంటున్నారట. సెటిల్మెంట్లు బాగా చేస్తారని కేడర్‌లో పెద్ద పేరుంది. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి? ప్రైవేట్‌ భూముల లెక్కేంటి? భూదాన్‌, వక్ఫ్‌, రెవెన్యూ ల్యాండ్స్‌ ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటి విలువ ఆయనకు కొట్టిన పిండి. ఇబ్రహీంపట్నం పరిధిలో అనేక బహుళ జాతి కంపెనీలు వచ్చాయి. మరికొన్ని క్యూలో ఉన్నాయి. ఈ డిమాండ్‌ కారణంగా ఎకరం మూడున్నర కోట్లు పలుకుతోంది. అందుకే ఇక్కడ ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే లేదా.. ఆయన షాడో అనుమతి ఉండాల్సిందేనని చెబుతారు.

షాడో ఆశీస్సులతో అనధికారిక వెంచర్లు?

సమస్య ఏదైనా షాడో ముందుకు రావాల్సిందే. ఆ తర్వాతే ఎమ్మెల్యే ఎంట్రీ ఇస్తారట. గిట్టుబాటు కాకుంటే మళ్లీ రావొద్దని హెచ్చరిస్తారట ఆ షాడో. ఇబ్రహీంపట్నంలో లెక్కకు మించి రియల్ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి. వీటిల్లో అనుమతి తీసుకున్నవి కొన్నైతే.. షాడో కనుసన్నల్లో నడిచేవి ఇంకా ఎక్కువేనట. ఈ అంశంపైనే తరచూ విపక్ష పార్టీలు ఆందోళనలు కూడా చేస్తుంటాయి. ఆ మధ్య కాలంలో ఇబ్రహీపట్నం పక్కనే ఉన్న రాందాస్‌పల్లిలో దాదాపు 300 ఎకరాలు, పట్టణంలోని విలువైన భూముల్లో ఎమ్మెల్యే అనుచరులు కలుగ జేసుకున్నట్టు ఆరోపించారు కాంగ్రెస్‌ నేతలు. దళితులు, పేదలకు చెందిన భూములతోపాటు.. వివాదాల్లో ఉన్న ల్యాండ్స్‌ను కబ్జా చేశారని వారు ఆరోపించారు కూడా.

ఎమ్మెల్యే అనుచరుల్లో బెరుకు లేదా?

గతంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పేరుతో ప్రభుత్వ నష్టపరిహార చెక్కులు రావడం దుమారం రేపింది. గడిచిన ఆరేళ్లుగా ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఎమ్మెల్యేకు గానీ.. ఆయన అనుచరుల్లోకానీ ఎలాంటి బెరుకు లేదట. మరో విధంగా అధికారాన్ని చేలాయిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్‌ వ్యక్తుల పాగా వేయడం.. షాడో ఆశీసులు లేకుండా జరదని చెవులు కొరుక్కుంటున్నారు. ఇలాంటి అక్రమాలను ప్రోత్సహించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడరట. మరి.. రానున్న రోజుల్లో ఈ షాడో ఇంకెంత చెలరేగిపోతారో చూడాలి.

Exit mobile version