గోదావరి జిల్లా వాసులు సంతోషం వస్తే పట్టలేరు. తేడా వచ్చిందో గోదారి యాసలోనే ఏకి పడేస్తారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు రెండో కేటగిరీలోకి చేరారట. ఎమ్మెల్యేగా అందరివాడుగా ఉన్న ఆయన మంత్రి అయ్యాక కొందరివాడుగా మారారని ఒకటే కామెంట్స్. ఎమ్మెల్యే అంటే ఆయనలా ఉండాలన్న వారు.. ఇప్పుడు మాకొద్దు బాబోయ్ అని దూరం జరుగుతున్నారట. ఎందుకలా? ఆయనలో వచ్చిన మార్పులేంటి? ఎవరా మంత్రి? లెట్స్ వాచ్!
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్‌మార్నింగ్ అని పర్యటించేవారు!
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. మొన్నటి ఎన్నికల్లో తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అనూహ్యంగా ఏడాది క్రితం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే జిల్లాలోని రాజోలుకు చెందిన వేణు అక్కడ రిజర్వేషన్ అనుకూలించక వైసీపీ అధిష్ఠానం ఆదేశాలతో రామచంద్రపురంలో పోటీ చేసి గెలిచారు. ఇంటిలో నుంచి బయటకు వస్తే జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి దణ్ణం పెడితేగానీ ఎక్కడకు వెళ్లబోరని టాక్ ఉంది. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అంటూ వేకువ జామునే నియోజకవర్గంలో పర్యటించి ప్రజల తలుపుతట్టి.. వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఆర్థిక భారమైన సమస్యలు మినహా మిగిలిన అన్నింటినీ వెంటనే అధికారులకు ఆదేశించి పరిష్కారించే వారు. ఆ విధంగా నియోజకవర్గంలో అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు.
మంత్రి అయ్యాక అస్సలు పట్టించుకోవడం లేదని కేడర్ కినుక!
మంత్రి అయ్యాక వేణులో చాలా మార్పు వచ్చిందట. ఈయన ఆయనేనా.. మన వేణునేనా అని ఒకటికి రెండుసార్లు గిచ్చి ప్రశ్నించుకునే పరిస్థితి జనాల్లోనూ పార్టీ కేడర్‌లోనూ కనిపిస్తోందట.
మరిచిపోయారా లేక మారిపోయారా అని సొంత పార్టీ వారే సెటైర్లు వేసుకునే పరిస్థితి. మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది తిరగకుండానే మంత్రి అయ్యాక.. తమను అస్సలు పట్టించుకోవడం లేదని జనాలు, కేడర్ ఉస్సూరు మంటున్నారట. పైగా సొంత సామాజికవర్గానికి తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయట. వేణు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా తిరిగినవారంతా.. ఇప్పుడు మంత్రిగారు కొందరి వారేనని చెవులు కొరుక్కుంటున్నారట.
గుడ్ మార్నింగ్ రాజమండ్రి అని మూడు రోజులు తిరిగారు!
రంపచోడరంలో పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ కారు వచ్చింది
రామచంద్రపురంలో మంత్రి వేణుపై పోటీచేసి ఓడిన తోట త్రిమూర్తులు వైసీపీలో చేరాక సీన్ మారిందట. రామచంద్రపురాన్ని వదిలేసి కొన్నాళ్లు రాజమండ్రిపై ఫోకస్ పెట్టారు వేణు. గుడ్ మార్నింగ్ రాజమండ్రి అంటూ ముచ్చటగా మూడుసార్లు పర్యటించి అక్కడి పార్టీ కేడర్‌లో జోష్ నింపారు. ఈ దూకుడు ఎంత వరకు వెళ్లిందంటే.. వచ్చే ఎన్నికల్లో వేణు.. రాజమండ్రి అర్బన్ లేదా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది. రాజమండ్రి బోర్ కొట్టిందో ఏమో.. మంత్రిగారి ఫోకస్ ఇప్పుడు రంపచోడవరంపై పడింది. ఇందుకోసం బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా తెచ్చుకున్నారు. కానీ.. ఏజెన్సీకి వెళ్లింది లేదు.
విపక్షాలు ఏజెన్సీలో పర్యటిస్తున్నా.. మంత్రి వేణు మౌనం?
గోదావరి పోటెత్తడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. అఖిలపక్షం పేరుతో మరికొందరు నాయకులు ఏజెన్సీలో పర్యటించారు. ఈ స్థాయిలో విపక్ష పార్టీలు ఏజెన్సీలోకి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నా.. మంత్రి వేణు అటుగా వెళ్లింది లేదు. ఈ అంశాన్ని కూడా రామచంద్రపురంలో కేడర్ కథలు కథలుగా చెప్పుకొంటున్నారట. కీలకమైన కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను సాధించలేకపోయారని.. నియోజకవర్గంలో రోడ్లు పాడైనా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారట. మరి.. ఈ విషయాలు మంత్రిగారి దృష్టికి వెళ్తున్నాయో లేదో కానీ.. కేడర్‌తో ఆయనకు గ్యాప్ వస్తోందని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి.
